Share News

Nagarjuna: హీరో నాగార్జున వ్యక్తిత్వ హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:35 AM

సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులు పర్సనాలటీ రైట్స్‌కు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించంది. పేరు, చిత్రాలు...

Nagarjuna: హీరో నాగార్జున వ్యక్తిత్వ  హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ

  • ఆయన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు వాడకూడదు

  • అశ్లీల చిత్రాలు తొలగించాలని 10 వెబ్‌సైట్లకు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 1: సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులు (పర్సనాలటీ రైట్స్‌)కు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించంది. పేరు, చిత్రాలు, ప్రత్యేకంగా గుర్తించదగ్గ హావభావాలు వంటి వ్యక్తిగత లక్షణాలు కేవలం ఆయన సొంతమని, అనుమతి లేకుండా ఇతరులు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఆయన పేరు, చిత్రాలను ఎలాంటి సమ్మతి లేకుండా వినియోగించే వారిపై ఆంక్షలు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుమతి ఉందన్న రీతిలో ఫొటోలను వాడుకుంటూ ఆయన వ్యక్తిత్వ, నైతిక హక్కులకు భంగం కలిగిస్తున్న పది వెబ్‌సైట్లపై ప్రత్యేకంగా ఆంక్షలు పెట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఆయన పేరును, చిత్రాలను, వ్యక్తిత్వానికి సంబంధించిన ఇతర ప్రత్యేక లక్షణాలను ఆ వెబ్‌సైట్లు దుర్వినియోగం చేస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని తెలిపింది. ఒకరి వ్యక్తిత్వ హక్కులను దోపిడీ చేయడం అంటే వారి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడంతో పాటు, గౌరవప్రదంగా జీవించే హక్కును ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంది. వారి పరపతి, ప్రఖ్యాతికి చెప్పలేనంత నష్టం కలిగిస్తుందని తెలిపింది. నాగార్జున వినోద రంగ పరిశ్రమలో సెలబ్రిటీ అని, కొన్ని చిత్రాలు ఆయనకు చెందినవిగా చెప్పుకోవడం తప్పుదోవ పట్టించడంతో పాటు పరువు నష్టం కలిగించేవని తెలిపింది. తగనిరీతిలో చేసిన అలాంటి చర్యలు కారణంగా ఆయన పేరు ప్రఖ్యాతులు పలచన అవుతాయని అభిప్రాయపడింది. పోర్నోగ్రాఫిక్‌ కంటెంట్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలను ఉపయోగించి తన పేరును దుర్వినియోగం చేశారని పేర్కొంటూ నాగార్జున 10 వెబ్‌సైట్లపై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆ సమాచారం మొత్తాన్ని 72 గంటల్లోగా తొలగించాలని సంబంధిత యూఆర్‌ఎల్‌లను ఆదేశించింది. కొన్ని యూఆర్‌ఎల్‌లు పనిచేయకుండా ఏడు రోజుల్లోగా బ్లాక్‌ చేయాలంటూ కేంద్ర ఐటీ, టెలికాం శాఖకు సూచనలు ఇచ్చింది.

Updated Date - Oct 02 , 2025 | 03:35 AM