Delayed Fee Reimbursement: రీయింబర్స్‌మెంట్ రాకుండానే 3 లక్షల మంది చదువు పూర్తి!
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:29 AM
నాలుగేళ్ల క్రితం ఆదిలాబాద్‌కు చెందిన పేద గిరిజన విద్యార్థి రాజ్‌కుమార్ ఎంసెట్‌లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో 3500 లోపు ర్యాంకు సాధించాడు..
నాలుగేళ్లుగా పైసా కూడా ఇవ్వని పాలకులు
బాజాప్త ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు
నష్టపోతున్నది పేద, మధ్య తరగతి విద్యార్థులే
నెరవేరని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల క్రితం ఆదిలాబాద్‌కు చెందిన పేద గిరిజన విద్యార్థి రాజ్‌కుమార్ ఎంసెట్‌లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో 3500 లోపు ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీఎ్‌సలో సీటు వచ్చింది. ఫీజు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని తల్లిదండ్రులు భావించగా.. నాలుగేళ్లలో రూ. 3.60 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంది కదా? అని ప్రశ్నిస్తే.. ప్రభుత్వం చెల్లించాక మీది మీకు ఇచ్చేస్తాం.. ముందైతే చెల్లించాల్సిందే అని కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఇది అతనొక్కడి సమస్యే కాదు.. రాష్ట్రంలోని మూడు లక్షల మంది విద్యార్థులదీ ఇదే పరిస్థితి. నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల కాకపోవడంతో ఇంజినీరింగ్, బీఫార్మసీ, నర్సింగ్ కోర్సులకు చెందిన ఒక బ్యాచ్ ముగిసింది. మూడేళ్ల వ్యవధిగల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల వ్యవధి గల ఎంబీఎ, ఎంసీఎ, ఎల్‌ఎల్‌ఎం లాంటి కోర్సులనూ విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ఇలా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకుండానే యూపీ, పీజీ చదువులు పూర్తిచేసుకున్న విద్యార్థుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల పైగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు బాహాటంగానే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. అటు.. పాలకులు, ఇటు.. యాజమాన్యాల మధ్య విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు.
ఫీజులు తీసుకుని.. ఖాళీ చెక్కులిచ్చి..
రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్ల బీటెక్, రెండేళ్ల ఎంటెక్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 4 లక్షలు కాగా, ఫార్మసీ, పాలిటెక్నిక్, మేనేజ్‌మెంట్, న్యాయ, బీఈడీ, ఎంఈడీ వంటి ఇతర వృత్తి విద్య కోర్సులు అభ్యసించే వారి సంఖ్య మరో 4లక్షల వరకు ఉంటుంది. నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పైసా కూడా విడుదల కాకపోవడంతో ఇంజనీరింగ్, నర్సింగ్, బీఫార్మసీ కోర్సుల్లో ఒక బ్యాచ్, కొన్ని వృత్తి విద్యాకోర్సుల్లో రెండు బ్యాచ్‌లకు చెందిన వారి చదవులు పూర్తయ్యాయి. వీరి సంఖ్య అటుఇటుగా 3లక్షల వరకు ఉంటుందని అంచనా. నాలుగేళ్ల పాటు విద్యార్థులే ఆయా కాలేజీలకు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. గట్టిగా ప్రశ్నించినా, ఫీజులు చెల్లించకున్నా.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బందులు పెడుతున్నాయి. చివరి సంవత్సరంలో పూర్తి ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఖాళీ చెక్కులు ఇచ్చి, ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే మీరు చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మబలుకుతున్నాయి. అయితే, ఉచిత విద్య పేరిట చేర్చుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తుండడంతో.. పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ.. కాలేజీల యాజమాన్యాల వాదన మరోలా ఉంది. తమకు ప్రభుత్వం నుంచి బకాయిలు రావడం లేదని, కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం నుంచి కాలేజీల బంద్ పాటిస్తామని ప్రభుత్వానికి నోటీసులు అందించాయి. ఏదేమైనా.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఉద్దేశం.. నెరవేరడం లేదన్న వాదన వినిపిస్తోంది.