Share News

Vice Chancellor Appointments: వర్సిటీలకు వీసీలు దొరకలేదా

ABN , Publish Date - Jul 05 , 2025 | 06:00 AM

విశ్వవిద్యాలయాల పాలనకు వైస్‌ చాన్సలర్లే కీలకం. కానీ... రాష్ట్రంలో ఏకంగా తొమ్మిది వర్సిటీలు ఏడాదికిపైగా ఇన్‌చార్జిల పాలనలో నడుస్తున్నాయి. జగన్‌ హయాంలో వీసీలుగా నియమితులైనవారు ప్రభుత్వం మారడంతో రాజీనామాలు చేశారు.

Vice Chancellor Appointments: వర్సిటీలకు వీసీలు దొరకలేదా

  • ఏడాదైనా ఇన్‌చార్జి పాలనే

  • 9 విశ్వవిద్యాలయాల్లో ఇక్కట్లు

  • నిలిచిపోయిన విధాన నిర్ణయాలు

  • జాతీయ విద్యా సంస్థల నుంచి మేధావులను తేవాలని యత్నం

  • ముందుకు సాగని ప్రక్రియ

విశ్వవిద్యాలయాల పాలనకు కీలకమైన వైస్‌ చాన్సలర్ల(వీసీ) పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. పోస్టులు ఖాళీ అయి ఏడాది దాటినా ఇంకా తొమ్మిది వర్సిటీలకు వీసీలను నియమించలేకపోతోంది. అవన్నీ ఇన్‌చార్జిల పాలనలోనే కొనసాగుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విశ్వవిద్యాలయాల పాలనకు వైస్‌ చాన్సలర్లే కీలకం. కానీ... రాష్ట్రంలో ఏకంగా తొమ్మిది వర్సిటీలు ఏడాదికిపైగా ఇన్‌చార్జిల పాలనలో నడుస్తున్నాయి. జగన్‌ హయాంలో వీసీలుగా నియమితులైనవారు ప్రభుత్వం మారడంతో రాజీనామాలు చేశారు. ఆ తర్వాత నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం కొంత సమయం తీసుకుంది. ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబరు 9న 17 వర్సిటీలకు వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. అప్పట్లో దాదాపు 2,500 దరఖాస్తులు అందాయి. అయితే, జాతీయ విద్యా సంస్థల ప్రొఫెసర్లను వీసీలుగా నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 18న తొమ్మిది వర్సిటీలకే వీసీలను నియమించింది. ఆంధ్రా, జేఎన్‌టీయూకే, యోగి వేమన, విక్రమ సింహపురి, రాయలసీమ, జేఎన్‌టీయూ అనంతపురం, పద్మావతి మహిళా, కృష్ణా, నన్నయ వర్సిటీలకు వీసీలను నియమించింది. అయితే, హైదరాబాద్‌ యూనివర్సిటీ నుంచి వచ్చి వేమన వర్సిటీ వీసీగా నియామకం పొందిన ఫణితి ప్రకాశబాబు ఆ తర్వాత మంచి అవకాశం రావడంతో రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ 9 వర్సిటీలకు వీసీలను నియమించాల్సి వచ్చింది. వీటిలో ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయ, జేఎన్‌టీయూ విజయనగరం, ద్రవిడ, ఉర్దూ, వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌, ఆంధ్ర కేసరి, శ్రీవెంకటేశ్వర, వేమన యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో నాగార్జున, ఎస్వీయూ, శ్రీకృష్ణ దేవరాయ వంటి కీలక వర్సిటీలకు రెగ్యులర్‌ వీసీలు లేకపోవడంతో పాలన గాడి తప్పుతోందన్న విమర్శలు వస్తున్నాయి.


ఇప్పుడు కొత్త సెర్చ్‌ కమిటీలు

కొన్నాళ్ల కిందట ప్రభుత్వం 4 యూనివర్సిటీలకు సెర్చ్‌ కమిటీలను నియమించింది. యూజీసీ కొత్త నామినీలతో శ్రీకృష్ణ దేవరాయ, జేఎన్‌టీయూ విజయనగరం, ఆచార్య నాగార్జున, ద్రవిడియన్‌ యూనివర్సిటీలకు సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు సిఫారసు చేసిన పేర్లు ప్రభుత్వానికి అందాయి. కాగా, ప్రభుత్వం మొత్తం తొమ్మిది వర్సిటీలకు ఒకేసారి వీసీల పేర్లు ప్రకటించాలనే ఆలోచనలో ఉంది. దీనికిగాను మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

వీసీలే కీలకం...

రెగ్యులర్‌ వీసీ ఉంటే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. లేనిపక్షంలో సాధారణ అంశాలకే ఈసీ పరిమితం అవుతుంది. వర్సిటీల్లో కీలక మార్పులు చేయాలంటే వీసీ నేతృత్వంలోని ఈసీ నిర్ణయం తీసుకోవాలి. కీలకమైన ఆర్జీయూకేటీ కూడా రెగ్యులర్‌ చాన్స్‌లర్‌ లేకుండానే కొనసాగుతోంది. ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు చాన్స్‌లర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. డైరెక్టర్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో నియమించినవారే కొనసాగుతున్నారు. మరోవైపు ఉన్నత విద్యామండలిలో వైస్‌ చైర్మన్లు ఇప్పటికీ జగన్‌ ప్రభుత్వం నియమించినవారే ఉన్నారు.

లక్ష్యం బాగున్నా

రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ప్రపంచంలోని టాప్‌-100లోకి తేవాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిలో భాగంగా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమిస్తే విశ్వవిద్యాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతారని భావిస్తోంది. ఈ క్రమంలో మొదట ప్రకటించిన తొమ్మిది యూనివర్సిటీల్లో ఎక్కువ మంది బయటి వారికి అవకాశం కల్పించింది. దీంతో మిగిలిన యూనివర్సిటీలకు కూడా అదే తరహాలో వీసీలను నియమించాలని ప్రభుత్వం భావించింది. ఫలితంగా వీసీల నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదేసమయంలో వైసీపీ హయాంలో భ్రష్టుపట్టిన వర్సిటీలకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని సర్కారు సంకల్పించింది. కానీ... వీసీల నియామకం మాత్రం కొలిక్కి రావడంలేదు. వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్‌ కమిటీల్లో యూజీసీ ప్రతినిధిని కూడా ఉండాలని... కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


డిగ్రీలో ‘సింగిల్‌ మేజర్‌’ విధానం!

పలు మార్పులతో అమలుకు ప్రభుత్వం నిర్ణయం

ఆఫ్‌లైన్‌లోనూ అడ్మిషన్లకు లోకేశ్‌ ఆదేశాలు

డిగ్రీ విద్యలో ప్రభుత్వం మళ్లీ మార్పులు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మూడు సబ్జెక్టుల విధానాన్ని మార్చి.. సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు డిగ్రీ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిపై సమీక్షించిన ఉన్నత విద్యామండలి డ్యూయల్‌ మేజర్‌ (రెండు సబ్జెక్టులు) విధానంపై నిర్ణయం తీసుకుంది. అయితే అది యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా, విద్యార్థులకు భారం పెంచేలా ఉందని భావించిన ప్రభుత్వం.. సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానాన్నే అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నట్లు కాకుండా సింగిల్‌ మేజర్‌ డిగ్రీలో పలు మార్పులు తీసుకురానుంది. అడ్మిషన్లలో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌కి కూడా అవకాశం కల్పించాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. సీట్లు భర్తీ సమయంలో విద్యార్థుల అంగీకారాన్ని ఆధార్‌ అథెంటికేషన్‌తో రికార్డు చేయాలన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 06:02 AM