Higher Education: చైర్మన్ లేరు.. నోటిఫికేషన్ ఇవ్వరు
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:56 AM
ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన కీలక వ్యవహారాలు ముందుకు సాగడం లేదు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ రిటైర్ కావడం, ప్రభుత్వం ఈ పోస్టును భర్తీ చేయకపోవడంతో...
2026-27కు సంబంధించిన ఫీజుల ఖరారులో విద్యా మండలి తీవ్ర జాప్యం
ఈ ఏడాదితో ముగుస్తున్న బ్లాక్ పీరియడ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన కీలక వ్యవహారాలు ముందుకు సాగడం లేదు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ రిటైర్ కావడం, ప్రభుత్వం ఈ పోస్టును భర్తీ చేయకపోవడంతో కీలకమైన ఫీజుల నిర్ణయం అటకెక్కింది. కనీసం ఇన్‌చార్జ్ చైర్మన్‌ను కూడా నియమించకపోవడంతో ఫీజుల నిర్ణయంలో ఆలస్యం జరుగుతోంది. ఇటీవల వరకు చైర్మన్‌గా ఉన్న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకటరమణ పదవీకాలం నవంబరు 9తో ముగిసింది. కమిషన్ నిబంధనల ప్రకారం.. ఉన్నత విద్యకు సంబంధించిన ఫీజులపై చైర్మనే నోటిఫికేషన్ జారీచేయాలి. 2023-24 నుంచి 2025-26 వరకు మూడేళ్ల కాలాని(బ్లాక్ పీరియడ్)కి ఖరారు చేసిన ఫీజుల గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి త్వరలో ఫీజులు ఖరారు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ, వైద్యం, నర్సింగ్ సహా ఇతర ఉన్నత విద్యా సంస్థలు సుమారు 3 వేల వరకు ఉన్నాయి. ప్రతి విద్యా సంస్థకు వారి మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల ఆధారంగా ఫీజులు నిర్ణయించాలి. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయమే పడుతుంది. గతంలో బ్లాక్ పీరియడ్‌కు ఫీజులు ఖరారు చేసేందుకు 2022, ఆగస్టు సమయంలోనే ప్రక్రియ ప్రారంభించేవారు. తొలుత కమిషన్ నోటిఫికేషన్ జారీచేస్తే అనంతరం నెల రోజుల పాటు విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత విద్యా సంస్థలు సమర్పించిన వివరాల్లో లోపాలుంటే తిరిగి వాటిని సరిదిద్దడానికి కొంత సమయం ఇస్తారు. విద్యా సంస్థలు ఇచ్చిన వివరాలపై ఆడిటింగ్ చేయించడానికి మరో నెల సమయం పడుతుంది.
సమయం సరిపోతుందా?
ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా ప్రక్రియ పూర్తికావడానికి ఎక్కువ కాలం పడుతుంది. 31 రకాల ఖర్చులు, వివరాలను విద్యా సంస్థలు సమర్పించాలి. వాటిలో ఒక్కటి తగ్గినా కమిషన్ మళ్లీ ఆ విద్యా సంస్థను పరిశీలనకు పిలుస్తుంది. దీనిలోనూ కోర్సుల వారీగా ఫీజులు సిఫారసు చేయాలి. ప్రస్తుత బ్లాక్ పీరీయడ్‌లో ఇంజనీరింగ్ కోర్సులకు రూ.43 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఫీజులున్నాయి. డిగ్రీ కోర్సులకు చాలా తక్కువగా ఫీజులు అమలవుతున్నాయి. అన్ని కోర్సులకు ఫీజులు పెంచాలని కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులు భారీగా పెంచితే ప్రభుత్వంపై ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం పెరుగుతుంది. అయితే, ఫీజులు ఎలా ఉండాలన్న విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించలేదు. ఫీజులు సవరించాలన్నా మళ్లీ కమిషన్‌కు పంపాల్సిందే. దీంతో ఫీజులు సిఫారసు చేసిన తర్వాత కూడా సమయం పట్టే అవకాశం ఉంది. 2026లో ఉన్నత విద్య కోర్సులు ప్రారంభమయ్యే నాటికి ఫీజులు ఖరారు చేసి ప్రభుత్వం జీవో జారీచేయాలి. సుమారు మే నెల నాటికి జీవో వస్తే ప్రక్రియ సాఫీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో వచ్చే ఏడాది నాటికి సమయం సరిపోతుందా.. అనేది ప్రశ్న.
కోర్టులకు వెళ్తే మరింత ఆలస్యం
2023లో ఫీజులు ఖరారు చేసినప్పుడు అనేక విద్యా సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇంజనీరింగ్ ఫీజులు చాలా తక్కువగా పెంచారని, వాటితో కాలేజీలు నడపలేమని వాదించాయి. దీంతో కౌనెల్సింగ్ ప్రారంభమయ్యే తేదీ వరకు ఫీజుల జీవో విడుదల కాలేదు. అది అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం కమిషన్ స్వేచ్ఛగా పనిచేయకుండా చేసిందన్న ఆరోపణలున్నాయి. తొలుత సిఫారసు చేసిన ఫీజులను ఇంకా తగ్గించాలని ప్రభుత్వం కమిషన్‌కు ఫైలు తిప్పి పంపింది. ఆ తర్వాత కొందరు ప్రభుత్వ పెద్దల ప్రో ద్బలంతోనే న్యాయస్థానానికి వెళ్లారన్న ఆరోపణలు వచ్చా యి. అయితే, ఎవరు కోర్టుకు వెళ్లినా ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీచేయక పోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.