Disciplinary Action Delay: క్రమశిక్షణా చర్యల్లో అలసత్వం వద్దు
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:52 AM
రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గినందుకు బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు ఆలస్యం అవుతున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ హరినారాయణ్ పేర్కొన్నారు.పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కమిటీలను తిరిగి ఏర్పాటు చేయాలని ఆదేశించారు

రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ హరినారాయణ్
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గడానికి కారణమైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని, దీంతో ఈ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయని స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ శుక్రవారం ఇచ్చిన ఒక మెమోలో పేర్కొన్నారు. ఆ ఉద్యోగులు రిటైర్ అయినప్పటికీ ఇంకా ఆ కేసులు పెండింగ్‌లోనే ఉండడంతో వారంతా పెన్షన్ ప్రయోజనాల కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. రిజిస్ర్టేషన్ల శాఖలోని డీఐజీలు, డీఆర్‌లు క్రమశిక్షణ చర్యలు సకాలంలో తీసుకోవడంలో విఫలమవుతున్నారని దీని వల్ల ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం, క్రమశిక్షణ చర్యలను సకాలంలో అమలుచేసేందుకు తక్షణమే జిల్లా స్థాయి కమిటీలను మళ్లీ ఏర్పాటు చేయాలని ఐజీ ఆదేశించారు. గతంలో ఇచ్చిన నిబంధనల మేరకు సకాలంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.