Share News

Devasthanam Officer Shanti: శాంతిపై చర్యలు ఇంకెప్పుడు..?

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:55 AM

దేవదాయ శాఖలో వివాదాస్పద అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతిని నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించే విషయంలో దేవదాయ శాఖ అధికారులు తీవ్ర...

Devasthanam Officer Shanti: శాంతిపై చర్యలు ఇంకెప్పుడు..?

  • కమిషనర్‌ నిర్బంధ ఉద్యోగవిరమణకు గతంలోనే నిర్ణయం

  • అయినా దేవదాయ అధికారుల కాలయాపన

  • మొన్న ఏపీపీఎస్సీకి లేఖ.. నిన్న ప్రభుత్వానికి..

  • వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన శాంతి

  • అప్పటి కమిషనరే నేడు దేవదాయ కార్యదర్శి

  • ఆమెపై చర్యలకు ఆమోదముద్ర వేస్తారా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖలో వివాదాస్పద అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతిని నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించే విషయంలో దేవదాయ శాఖ అధికారులు తీవ్ర జాప్యం చేసున్నారు. ఆమెపై మోపిన ఆభియోగాలన్నీ దాదాపు నిరూపితమయ్యాయి. ఆమె చేయని తప్పంటూ లేదని విచారణాధికారి తన నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. దేవదాయ శాఖ నిధుల దుర్వినియోగం, స్వయంగా అవినీతికి పాల్పడడమే గాక.. సిబ్బందిని కూడా అందుకు ప్రోత్సహించడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియాతో బహిరంగంగా మాట్లాడడం, రాష్ట్ర సర్వీసు (సీసీఏ) నిబంధనలను తుంగలో తొక్కడంతో పాటు నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేల్చారు. దరిమిలా.. నిర్బంధ ఉద్యోగ విరమణ ఎందుకు చేయించకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆగస్టు 16న శాంతికి దేవదాయ కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఆమె వివరణ కూడా ఇచ్చారు. అసిస్టెంట్‌ కమిషనర్‌గా నిబంధనల ప్రకారమే వ్యవహరించానని, ఉల్లంఘనకు పాల్పడలేదని చెప్పిందే మళ్లీ చెప్పుకొచ్చారు. ఆమె వివరణ సంతృప్తికరంగా లేదని, నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించాలని కమిషనరేట్‌ అధికారులు నిర్ణయించారు. గత నెలలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఆమెను విధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు దేవదాయ శాఖ ఫైలు సిద్ధం చేసింది. కేవలం కమిషనర్‌ ఆర్డర్‌ ఇవ్వడమే తరువాయి. ఈ దశలో.. ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా.. ముఖ్యంగా నిర్బంధ ఉద్యోగ విరమణ లాంటి చర్యలు తీసుకునే సమయంలో కచ్చితంగా ఏపీపీఎస్సీ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉందని కొత్త రూల్‌ను కమిషనరేట్‌ అధికారులు తెరపైకి తీసుకువచ్చారు. దీంతో నిర్బంధ ఉద్యోగ విరమణ ఫైలుకు బ్రేకు పడింది. గత నెల రెండో వారంలో దేవదాయ శాఖ అధికారులు ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. శాంతిని నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.


20 రోజుల తర్వాత దేవదాయ శాఖ కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ నుంచి సమాధానం వచ్చింది. దేవదాయ కమిషనరేట్‌ నుంచి వచ్చే లేఖలపై తాము జవాబివ్వబోమని.. ప్రభుత్వం నుంచి వచ్చే లేఖలకు మాత్రమే స్పందిస్తామని.. అవసరమైతే ప్రభుత్వాన్ని అనుమతి కోరాలని అందులో సూచించారు. దీంతో దేవదాయ కమిషనరేట్‌ అధికారులు శాంతి విషయంలో ఏం చేయాలో స్పష్టత కోరుతూ.. ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన లేఖను కూడా జత చేసి.. ప్రభుత్వానికి అంటే దేవదాయ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రస్తుతం హరిజవహర్‌లాల్‌ ఆ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన దేవదాయ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే అసిస్టెంట్‌ కమిషనర్‌గా శాంతి పలు అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చినా ఆమెపై హరిజవహర్‌లాల్‌ ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. కొన్ని చోట్ల అదనపు బాధ్యతలు కూడా అప్పగించేవారు. ఈ నేపథ్యంలో శాంతిని సాగనంపే నిర్ణయాన్ని ఆయన ఆమోదిస్తారా అనేది చూడాలి.

తొలి నుంనీ ఆలస్యమే..

శాంతి విషయంలో దేవదాయ కమిషనరేట్‌ మొదటి నుంచీ మెతకగానే వ్యవహరిస్తోంది. విచారణ జరిపే విషయంలో అధికారులు చాలా ఆలస్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎట్టకేలకు గతేడాది జూలై 2వ తేదీన ఆమెను సస్పెండ్‌ చేసి.. అభియోగాలు నమోదు చేశారు. సస్పెండ్‌ చేసి దాదాపు 15 నెలలు పూర్తయింది. నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించాలని నిర్ణయించి.. సదరు ఫైల్‌ను ఏపీపీఎస్సీ, ప్రభుత్వం అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఆమెపై చర్యల విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శాంతి అసిస్టెంట్‌ కమిషనర్‌గా కేవలం 6సీ ఆలయాలకు సంబంధించిన పరిపాలన వ్యవహారాలు మాత్రమే చూసుకోవాలి. కానీ ఆమె 6బీ, 6ఏ ఆలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని.. వాటి పరిధిలోని లీజులు, లైసెన్సుల కొనసాగింపునకు సంబంధించిన ఫైళ్లను దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించారు. అధికారులు ఆమె అధికార పరిధిని .ప్రశ్నించకుండా.. ఆమె పంపించిన ప్రతి ఫైలునూ ఆమోదించారు. ఆమె పరిధి కాకపోయినా లీజులు, లైసెన్సుల కొనసాగింపు ఫైళ్లను పంపడం.. వాటిని ప్రధాన కార్యాలయ అధికారులు ఆమోదించడం కూడా పెద్ద నేరం. అప్పట్లో దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆమెకు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నా.. శాఖ ఉన్నతాధికారులు ఏ ఊసే ఎత్తడం లేదు. ఎందుకంటే.. అప్పుడు అనుమతులిచ్చిన అధికారులే ఇప్పుడు కమిషనరేట్‌లో, సచివాలయంలో కీలకమైన పోస్టుల్లో ఉన్నారు. శాంతి పంపిన ఫైళ్లన్నీ బయటకు తీస్తే దేవుడి ఆదాయానికి ఎంత నష్టం జరిగిందో, ఆమెకు ఎవరెవరు సహకరించారో వెలుగులోకి వస్తుంది. ఇది బయటకు వస్తుందనే ఆమెపై చర్యలను దేవదాయ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Oct 23 , 2025 | 04:55 AM