Female Faculty Harassment: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:11 AM
విశాఖపట్నం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులే కారణమని...
ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఓ టీచర్ లైంగిక వేధింపుల అంశం ప్రస్తావన
వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు అందజేత
ఎం.వి.పి.కాలనీ (విశాఖ పట్నం), అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు... స్థానిక ఎంవీపీ కాలనీ నాలుగో సెక్టార్‌లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కోన సూరిబాబు పెద్ద కుమారుడు సాయితేజ (22) సమతా డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు తనను నిత్యం వేధిస్తున్నారని, పరీక్షల్లో జవాబులు బాగా రాసినా మార్కులు వేయడం లేదని, రికార్డులు అధికంగా రాయిస్తున్నారని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పాడు. అధ్యాపకుల వేధింపులపై యాజమాన్యంతో మాట్లాడేందుకు సాయితేజ తల్లిదండ్రులు, మామయ్య శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లారు. అక్కడ ఉండగానే వారు ఇంట్లో ఉన్న సాయితేజతో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతిచెంది ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్లాస్ టీచర్ లైంగిక అవసరాల కోసం ఒత్తిడి!
కుటుంబసభ్యులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఓ అధ్యాపకురాలి లైంగిక వేధింపుల అంశాన్ని ప్రస్తావించారు. దానికి విద్యార్థితో ఇద్దరు మహిళా అధ్యాపకుల వాట్సాప్ చాటింగ్‌లను జత చేశారు. స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు, క్లాస్ టీచర్ కలసి తనను వేధిస్తున్నట్టు సాయితేజ పలుసార్లు తమకు చెప్పాడని పేర్కొన్నారు. క్లాస్ టీచర్, స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు మంచి మిత్రులని.. క్లాస్ టీచర్ లైంగిక అవసరాల కోసమే సాయితేజపై స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు ఒత్తిడి తెచ్చే వారని ఆరోపించారు. పరీక్షల్లో బాగా రాసినా మార్కులు వేయకుండా, రికార్డులపై ఉద్దేశపూర్వకంగా సంతకం పెట్టకుండా వేధించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుడు సాయితేజ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లాస్ టీచర్ వాట్సాప్ మెసేజ్‌లపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం పేర్కొంది. కాగా, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం, కమ్యూనిస్టు నాయకులు కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. నిష్పాక్షిక విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి హామీ ఇచ్చి పంపించారు.