Share News

Degree Admissions Only Online: ఆన్‌లైన్‌లోనే డిగ్రీ అడ్మిషన్లు

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:48 AM

ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ డిగ్రీ అడ్మిషన్లు చేపడతామన్న ప్రభుత్వం చివరికి ఆన్‌లైన్‌ విధానంలో అడ్మిషన్లకే నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2025 26 డిగ్రీ అడ్మిషన్లపై..

Degree Admissions Only Online: ఆన్‌లైన్‌లోనే డిగ్రీ అడ్మిషన్లు

  • 26 వరకు రిజిస్ర్టేషన్‌.. 31న సీట్ల కేటాయింపు

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ డిగ్రీ అడ్మిషన్లు చేపడతామన్న ప్రభుత్వం చివరికి ఆన్‌లైన్‌ విధానంలో అడ్మిషన్లకే నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2025-26 డిగ్రీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్థులు https://oamdc.ucanapply.com/?appid=OAMDC#no-back-button వెబ్‌సైట్‌ ద్వా రా ఈనెల 26 వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. 24 నుంచి 28 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు గడువు ఉంటుంది. 29న మార్చుకోవచ్చు. ఈనెల 31న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ విద్యార్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లించాలి. మొబైల్‌ నంబరు, ఆధార్‌ నంబరు, ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబరు ఇచ్చి విద్యార్థులు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. కాగాడిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో ఇటీవల చర్చలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్సీలు ఆఫ్‌లైన్‌లోనూ అడ్మిషన్లు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లపై జీవో కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్‌ కేవలం ఆన్‌లైన్‌ విధానంలో సీట్లు భర్తీ చేసేందుకే ఇచ్చారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి బుధవారం అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఆఫ్‌లైన్‌ అడ్మిషన్లపై ఇందులోనూ ఎలాంటి స్పష్టత రాలేదు.

అద్దె భవనాల్లోనే కొనసాగింపు

ఈ ఏడాది డిసెంబరు నాటికి అన్ని కాలేజీలు కచ్చితంగా సొంత భవనాల్లోకి మారాలని వైసీపీ ప్రభుత్వంలో జీవో జారీ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 30 ఏళ్ల లీజుకు అనుమతిస్తూ మరో జీవో ఇచ్చారు. ఒకవేళ సొంత భవనం లేకపోతే 30 ఏళ్ల లీజుతో ఉన్న భవనాల్లోకి కాలేజీలు మార్చుకోవాలని ఆదేశించింది. ఈ ఏడాది చివరితో కాలపరిమితి ముగుస్తున్నందున అద్దె భవనాల్లో ఉన్న కాలేజీలు తప్పనిసరిగా 30 ఏళ్ల లీజు భవనాల్లోకి మారే ప్రతిపాదనలు వర్సిటీలకు సమర్పించాలి. కానీ దాదాపు 450 కాలేజీలు దీనిపై ప్రతిపాదనలు సమర్పించలేదని తెలిసింది. అయినా యూనివర్సిటీలు ఆ కాలేజీలకు అఫిలియేషన్లు మంజూరు చేశాయి. దీనిపై మిగిలిన కాలేజీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 21 , 2025 | 05:49 AM