Degree Admissions: తరగతులు అయిపోతున్నా.. ముగియని అడ్మిషన్లు!
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:46 AM
డిగ్రీ అడ్మిషన్లలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. రెండు నెలల కిందట విద్యా సంవత్సరం ప్రారంభమైతే..
డిగ్రీ మేనేజ్‌మెంట్ కోటాకు ఇప్పుడు షెడ్యూలు
రెండు నెలల కిందటే విద్యాసంవత్సరం ప్రారంభం
సమీపిస్తున్న మొదటి సెమిస్టర్ పరీక్షలు
ఆ విద్యార్థులు చదివేదెలా.. పరీక్షలు రాసేదెలా?
అడ్మిషన్ల ప్రక్రియలో మొదటి నుంచీ గందరగోళమే..
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): డిగ్రీ అడ్మిషన్లలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. రెండు నెలల కిందట విద్యా సంవత్సరం ప్రారంభమైతే.. ఉన్నత విద్యామండలి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఎట్టకేలకు షెడ్యూలు జారీచేసింది. సోమవారం నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 28తో ముగుస్తుంది. మరోవైపు కన్వీనర్ కోటాలో మూడో విడత సీట్ల కేటాయింపు కొద్ది రోజుల కిందటే ముగిసింది. సెమిస్టర్-1 పరీక్షలు సమీపిస్తున్నా.. ఇంకా అడ్మిషన్లు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇంకెప్పుడు చదువుతారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెప్టెంబరు 18న డిగ్రీ తరగతులు ప్రారంభం కాగా.. మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ అయ్యే నాటికి రెండు నెలలకు పైగా తరగతులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత మొదటి సెమిస్టర్ పరీక్షలకు నెలన్నర సమయమే ఉంటుంది. ఇప్పటివరకూ మూడో విడతల్లో 1.6 లక్షల వరకు సీట్లు భర్తీ అయ్యాయని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నా, అధికారికంగా గణాంకాలు విడుదల చేయలేదు.
డిగ్రీ ‘మేజర్’పై తుది నిర్ణయానికే..
ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్ల వ్యవహారం మొదటి నుంచీ గందరగోళంగానే ఉంది. గత వైసీపీ ప్రభుత్వం సింగిల్ మేజర్ డిగ్రీని ప్రవేశపెట్టగా... ఉన్నత విద్యామండలి దాని స్థానంలో డబుల్ మేజర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ అధికారులు మళ్లీ సింగిల్ మేజర్‌కే మొగ్గు చూపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికే ఎక్కువ సమయం పట్టింది. ఆ తర్వాత ఆగస్టు చివర్లో డిగ్రీ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేసింది. మొదటి విడత సీట్ల భర్తీలోనే ఎక్కువ జాప్యం చేసింది. అడ్మిషన్లలో ఆన్‌లైన్ సేవలు అందించే కంపెనీ సక్రమంగా పనిచేయకపోవడంతో ఈ జాప్యం ఏర్పడింది. వెబ్‌సైట్‌లో పొరపాట్ల కారణంగా దరఖాస్తుల్లో చాలా తప్పులు కనిపించాయి. చివరికి 30 వేల దరఖాస్తులు సక్రమంగా లేవని వెనక్కి పంపారు. ఆ తర్వాత కూడా ప్రకటించిన తేదీకి సీట్లు కేటాయించలేకపోయారు. పదేపదే సీట్ల కేటాయింపును మండలి వాయిదా వేసింది. ఫలితంగా మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే ఎక్కువ ఆలస్యం జరిగిపోయింది. దానివల్ల ఆ తర్వాత విడతల కౌన్సెలింగ్‌లు కూడా ఆలస్యమవుతూ వచ్చాయి.
ఆ కంపెనీ సేవలు తక్కువ ధరకు వస్తున్నాయని..
అడ్మిషన్లలో జాప్యానికి రెండు అంశాలు ప్రధానం! సింగిల్ మేజర్, డబుల్ మేజర్‌పై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ స్థాయిలో ఎక్కువ సమయం పట్టింది. ఆ తర్వాత తక్కువ ధరకు వస్తోందని ఆన్‌లైన్ అడ్మిషన్లకు సేవలు అందించే కంపెనీని ఉన్నత విద్యామండలి మార్చేసింది. ఇప్పటివరకూ పనిచేసిన కంపెనీ ఒక్కో విద్యార్థికి రూ.60 చార్జ్ చేసింది. అయితే రూ.12కే పని చేస్తామని కొత్త కంపెనీ ముందుకు రావడంతో మండలి అధికారులు దాన్ని ఖరారు చేశారు. తీరా చూస్తే దరఖాస్తులనే ఆ కంపెనీ అస్తవ్యస్తం చేసింది. ఇంటర్మీడియట్ మార్కుల అనుసంధానం(ఫెచ్చింగ్), లాగిన్‌లు, విద్యార్థుల సమాచారం అంతా గందరగోళం చేసింది. చివరికి సీట్ల కేటాయింపు తేదీని పదేపదే వాయిదా వేశారంటే.. ఆ కంపెనీ ఎలా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
జనవరిలో సెమిస్టర్-1 పరీక్షలు
వచ్చే జనవరి 17 నుంచి సెమిస్టర్-1 పరీక్షలు ప్రారంభమవుతాయి. జనవరి 7 నుంచి మిడ్ టర్మ్-2 పరీక్షలున్నాయి. ఆ వెంటనే మూడు రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయి. దీంతో మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు దాదాపు నెల రోజుల సమయమే ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో మొదటి నుంచి తరగతులకు హాజరుకాని విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? అని కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.