Deepika: పట్టుదలతో సాధించా..
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:00 AM
పూట గడవడం కష్టంగా ఉండేది. అన్నం దొరకడం గగనంగా ఉండేది. చాలాసార్లు తిండికి ఇబ్బందులు పడ్డాం. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నా.
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఘన సత్కారం
మడకశిరటౌన్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘పూట గడవడం కష్టంగా ఉండేది. అన్నం దొరకడం గగనంగా ఉండేది. చాలాసార్లు తిండికి ఇబ్బందులు పడ్డాం. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నా. అంధురాలికి చదువెందుకన్నారు. బడికి పంపొద్దని అమ్మానాన్నకు చెప్పారు. చులకనగా మాట్లాడారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. పట్టుదలతో కష్టపడ్డా. అనుకున్నది సాధించా. అందరూ చులకనగా మాట్లాడుతుంటే.. బాధపడ్డ నా తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేశా’ అని భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక భావోద్వేగానికి గురయ్యారు. దీపిక సారథ్యంలోని భారత జట్టు ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని మారుమూల గ్రామమైన తంబాళహట్టికి చెందిన దీపిక భారత జట్టును ప్రపంచ చాంపియన్‌గా నిలిపి, ఎన్నో అవమానాలకు సమాధానం చెప్పింది. ప్రపంచ కప్ విజయానంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆమెకు సోమవారం మడకశిరలో భారీ స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, సినీనటుడు సాయికుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మడకశిర జూనియర్ కళాశాల మైదానంలో సన్మాన సభ నిర్వహించారు. అంధుల టీ-20 ప్రపంచక్‌పలో భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కడం తన అదృష్టమని దీపిక తెలిపారు. అనంతరం ఆమెను ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు.