కోడుమూరులో డెకాయ్ ఆపరేషన్
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:03 AM
పట్టణంలోని బాషా నర్సింగ్ హోమ్‌పై ఆదివారం సాయంత్రం డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వైద్యబృందం
ప్రైవేటు ఆస్పత్రి సీజ్
కోడుమూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బాషా నర్సింగ్ హోమ్‌పై ఆదివారం సాయంత్రం డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో పీసీ పీఎన్‌డీటీ స్టేట్ నోడల్ ఆఫీసర్ అనిల్‌కుమార్, కర్ణాటక పీసీ పీఎన్‌డీటీ స్టేట్ వివేక్‌దొరై, డీఎంహెచ్‌వో శాంతికళ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆస్పత్రిని సీజ్‌చేసినట్లు తెలిపారు. వివరాలు.. కర్ణాటకలో వచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాటక, కర్నూలు వైద్యం బృందం సహకారంతో డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఆరునెలల గర్భిణికి మైక్ ఏర్పాటు చేసి బాషా నర్సింగ్ హోమ్‌కు పంపించారు. కొంత డబ్బు తీసుకొని లింగనిర్ణారణ పరీక్షలు చేసి గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని నిర్ధారించాడు. ఈ సమయంలో వైద్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరీక్షలు నిర్వహించిన యునాని వైద్యుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిని సీజ్‌చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఏడుగురు రోగులను మరో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బహిరంగంగా లింగనిర్ధారణ పరీక్షలు చేపట్టడంపై స్టేట్ నోడల్ ఆఫీసర్ జిల్లా వైద్యాధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఈ ఆస్పత్రిపై..
బాషా నర్సింగ్‌హోమ్‌లో కొన్నేళ్ల నుంచి లింగనిర్ధారణ పరీక్షలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఈ ఆస్పత్రిపై దాడులు నిర్వహించి సీజ్ చేసిన సంద ర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆసుపత్రి నిర్వాహకుల్లో చలనం లేదు. దీంతో కర్ణాటక, ఏపీలోని పలు జిల్లాల నుంచి గర్భిణులు ఇక్కడికి వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వెళ్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి అధికారులు కొన్ని సం వత్సరాల కిందట దాడులు చేపట్టి ఆసుపత్రిని సీజ్‌చేశారు. ఇంత జరిగినా ఇదే ఆసుప త్రిలో బహిరంగంగా లింగనిర్ణారణ చేపట్టడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.