Botsa Satyanarayana: పార్టీలో చర్చించి రాజధానిపై నిర్ణయం
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:02 AM
రాజధాని అమరావతా.. మూడు రాజధానులా అనేది తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ చెప్పారు.
వినాయక చవితి తర్వాతే మిథున్‌రెడ్డితో జగన్ ములాఖత్: బొత్స
రాజమహేంద్రవరం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : రాజధాని అమరావతా.. మూడు రాజధానులా అనేది తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త బొత్స సత్యనారాయణ చెప్పారు. గురువారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాననీరు రెండు అడుగుల వరకూ ఉన్నందునే అమరావతి మునిగిందని చెప్పామని.. దీనిపై కేసులు పెడతామంటున్నారని.. ఎలా పెడతారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. దానిని రక్షించడం కోసం ఉద్యమిస్తున్నామన్న జనసేన.. ఈనెల 30న విశాఖలో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘యోగా డే కోసం ప్రధానమంత్రి విశాఖ వచ్చి కనీసం ఉక్కు మాట ఎత్తలేదు. కూటమి ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయలేదు. ప్రధాని వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఏదో ఒకటి ప్రకటించాలి కదా! ఆయన వచ్చి ఏం లాభం.. ఏంమేలు జరిగింది? రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని కలవడానికి జగన్ 25న రావాలనుకున్నారు. కానీ వినాయక చవితి వెళ్లిన తర్వాత వస్తారు’ అని చెప్పారు.
ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు
ఉపరాష్ట్రపతి రాజ్యాంగ పదవి అని, నంబర్ గేమ్ ఉండకూడదనే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నామని బొత్స తెలిపారు. గతంలో కాంగ్రెస్ నుంచి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా జగన్ మద్దతిచ్చారని.. కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా ఎన్నికయ్యేటప్పుడూ తాము పోటీ పెట్టలేదని చెప్పారు.