మీరే తేల్చుకోండి!
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:18 AM
తహసీల్దార్ల అడ్‌హక్ పదోన్నతులపై మీరే తేల్చుకుని రావాలంటూ రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్‌లు, ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్‌లకు కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కృష్ణా డీఆర్‌వో రెండు వర్గాలకు సూచించారు. రెవెన్యూలో తహసీల్దార్ల ఖాళీల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అడ్‌హక్ పదోన్నతులు ఇస్తున్నప్పటికీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో మాత్రం ఇవి జరగటం లేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఇరువర్గాలు ఒక ఒప్పందానికి వస్తే అడ్‌హక్ పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైంది.
- తహసీల్దార్ల అడ్‌హక్ పదోన్నతులపై కృష్ణా డీఆర్‌వో ఆఫర్!
- రెగ్యులర్ డీటీలు, ప్రొబేషనరీ డీటీల మధ్య చర్చలు ప్రారంభం
- 70-30 విధానంలో కేటాయింపునకు ఒప్పందం!
- రెగ్యులర్ డీటీలకు 16 పోస్టులు, ప్రొబేషనరీ డీటీలకు 4 పోస్టులు కేటాయించే అవకాశం
- ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు రెగ్యులర్ డీటీలు
తహసీల్దార్ల అడ్‌హక్ పదోన్నతులపై మీరే తేల్చుకుని రావాలంటూ రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్‌లు, ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్‌లకు కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కృష్ణా డీఆర్‌వో రెండు వర్గాలకు సూచించారు. రెవెన్యూలో తహసీల్దార్ల ఖాళీల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అడ్‌హక్ పదోన్నతులు ఇస్తున్నప్పటికీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో మాత్రం ఇవి జరగటం లేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఇరువర్గాలు ఒక ఒప్పందానికి వస్తే అడ్‌హక్ పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 20 మంది తహసీల్దార్ల కొరత ఉన్న నేపథ్యంలో 23 మంది రెగ్యులర్ డీటీలు, 18 మంది పీడీటీలు అడ్‌హక్ పదోన్నతుల కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా జోన్ - 2 పరిధిలో ఉంది. ఉమ్మడి కృష్ణాతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు కూడా ఉన్నాయి. జోన్ - 2 పరిధిలో సీసీఎల్‌ఏ సీనియారిటీ జాబితా ప్రకారం చూస్తే రెగ్యులర్ డీటీలే ఉన్నారు. దీంతో పీడీటీలు కోర్టు మెట్లెక్కారు. దీనిపై స్టే వస్తే ఎటూ తేల్చని పరిస్థితి ఏర్పడుతోంది. ‘ఆంధ్రజ్యోతి’ కథనం నేపథ్యంలో కృష్ణాజిల్లా డీఆర్‌వో ఉభయ వర్గాలను పిలిచి.. అడ్‌హక్ పదోన్నతులు ఇవ్వటానికి అంగీకారం తెలిపారు. అడ్‌హక్ పదోన్నతులు ఇవ్వాలంటే ఉభయ వర్గాలు ఒక అవగాహనకు రావాల్సిందిగా సూచించారు. అడ్‌హక్ పదోన్నతులకు సంబంధించి 50 - 50 లేదా 70 - 30 విధానంలో మీ మధ్య ఆమోదయోగ్యమైన ఒప్పందం చేసుకుని రావాల్సిందిగా ఆఫర్ ఇచ్చారు. దీనిపై పీడీటీలు సుముఖంగానే ఉన్నా.. రెగ్యులర్ డీటీలు మాత్రం తర్జన భర్జనలు పడుతున్నారు. రెగ్యులర్ డీటీలు మొత్తం 23 మంది ఉన్నారు. సీసీఎల్‌ఏ సీనియారిటీ జాబితా ప్రకారం చూసినా వీరిలో 20 మందికే అడ్‌హక్ పదోన్నతులు వస్తాయి. ముగ్గురు వేచి చూడాల్సి వస్తోంది. పూర్తిగా అందరికీ పదోన్నతులు రావు. దీనిని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ డీటీలు, పీడీటీలతో సమావేశమై 70 - 30 విధానంలో అడ్‌హక్ పదోన్నతులను పంచుకుందామని లోపాయికారీగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రెగ్యులర్ డీటీలు 23 మందిలో ముగ్గురు అడ్‌హక్ పదోన్నతులను స్వీకరించబోమని.. తమకు నేరుగా ప్రమోషన్లు వచ్చినపుడే స్వీకరిస్తామని చెప్పటంతో ప్రస్తుతం 20 మందే రంగంలో ఉన్నారు. ఈ 20 మందిలో మరో నలుగురు పీడీటీలతో 70 - 30 ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిని కనుక అంగీకరిస్తే నలుగురికి పదోన్నతులు రావు. పీడీటీలతో కుదుర్చుకున్న 70 - 30 ఒప్పందం ప్రకారం చూస్తే 20 రెగ్యులర్ డీటీలలో 16 మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. పీడీటీల విషయానికి వస్తే మొత్తం 18 మంది అడ్‌హక్ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో నలుగురికి మాత్రమే పదోన్నతులకు అవకాశం కలుగుతుంది. రెగ్యురల్ డీటీలు నలుగురు 70-30 ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుండటంతో .. ప్రస్తుతం అడ్‌హక్ పదోన్నతులకు అడ్డంకిగా మారింది. ఈ కారణం చేత నలుగురు రెగ్యులర్ డీటీలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కనుక ఒక కొలిక్కి వస్తే .. అడ్‌హక్ పదోన్నతులకు లైన్ క్లియర్ అవుతుంది. ప్రస్తుతం వారిని బుజ్జగించే పనిలో రెగ్యులర్ డీటీలు ఉన్నారు.
జాప్యం జరిగే అవకాశం!
కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మంచివే అయినప్పటికీ.. అడ్‌హక్ పదోన్నతులలో ఉభయులను ఒప్పందం చేసుకోమనటం వివాదాస్పదంగా మారుతోంది. రెగ్యులర్ పదోన్నతులకు సంబంధించి ఉభయుల మధ్యన వివాదం నడుస్తోంది. ఈ వివాదం తేలే వరకు రెగ్యులర్ పదోన్నతులు ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని అవసరాలరీత్యా వేసే అడ్‌హక్ పదోన్నతులకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో ఉభయ పక్షాలను పిలిపించాల్సిన అవసరం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉభయులను మాట్లాడుకుని రావాల్సిందిగా ఇచ్చిన ఆఫర్ మంచిదే అయినా.. వాళ్ల మధ్య సంధి కుదరకపోతే మాత్రం అడ్‌హక్ పదోన్నతులు జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.