Share News

డెత జర్నీ

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:30 AM

డెత జర్నీ.. అవును వారికి అదే మరణ ప్రయాణం.

    డెత జర్నీ

బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలు

19 మంది ప్రయాణికులు సజీవ దహనం

మృతుల్లో ఇద్దరు చిన్నారులు

బైకర్‌ దుర్మరణం

27మందికి స్వల్ప గాయాలు

ఇద్దరు బస్సు డ్రైవర్లలో ఒకరు పరార్‌..

మరొకరు పోలీసుల అదుపులో

చిన్నటేకూరు సమీపంలో ఘటన

డెత జర్నీ.. అవును వారికి అదే మరణ ప్రయాణం. ఆ ప్రయాణం తల్లీకొడుకులను కాటికి చేర్చింది. తల్లీ కుమార్తెలను బలితీసుకుంది. అన్నదమ్ములను దూరం చేసింది. స్నేహితులకు కన్నీటిని మిగిల్చింది. చక్కనైన ఓ కుటుంబాన్ని మరుభూమికి పంపించేసింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం 20 నిండు ప్రాణాలను బలిగొంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలే. ఎవరిని కదిపినా కన్నీటి సుడులే. సాఫీగా సాగాల్సిన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీపావళి అనంతరం కుటుంబీకులతో గడిపిన ఆనంద క్షణాలు గంటల వ్యవధిలో బాధగా మారాయి. బస్సులో ఇదే చివరి ప్రయాణమని వారికి తెలియదు పాపం. పిల్లాపాపలతో, స్నేహితులతో కలిసి ప్రయాణం ప్రారంభించారు. విధుల్లో చేరేందుకు కొందరు.. బంధు మిత్రులను కలిసేందుకు మరికొందరు.. అత్యవసర పనులపై పలువురు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు. భాగ్యనగరం దాటి బస్సు హైవేపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లింది. రాత్రి కావటంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఇక ఐదారు గంటలైతే అందరూ గమ్యస్థానాలకు చేరుకునేవారు. అంతలోనే ఘోరం జరిగింది. సమయం తెల్లవారుజామున 3:30గంటలు.. హైవేపై ఏదో అలికిడి.. బైక్‌ను బస్సును ఢీకొట్టింది. ఒక్కసారిగా భారీ శబ్ధం.. చుట్టూ చిమ్మచీకటి... దట్టమైన పొగలు.. ప్రజల హాహాకారాలు.. సెకండ్ల వ్యవధిలోనే ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు వ్యాపించాయి.. కాపాడండి.. రక్షించండి అంటూ ఆర్తనాదాలు.. తలుపులు తెరుచుకోలేదు.. ఏమైందోనని తేరుకునే లోపు జరిగిన రాని నష్టం జరిగింది. గాఢ నిద్రలో ఉన్నవారు మాంసపు ముద్దలుగా మారారు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 19మంది అగ్నికి ఆహుతి అయ్యారు. బస్సు కింద పడ్డ ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వెరసి 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యుఒడిలోకి చేరుకోగా ఇందులో అభంశుభం తెలియని చిన్నారులు సైతం మృత్యుఒడిలోకి చేరుకున్నారు. జీవమరణ పోరాటంలో ఎలాగైనా నెగ్గాలని కొందరు యువకులు సాహసం చేశారు. గుండెధైర్యాన్ని ప్రదర్శించారు.. ఒక్కసారిగా కండ బలంతో కిటికీలను బద్దలు కొట్టారు.. తమతో పాటు మరికొంత మందిని బస్సు నుంచి బయటకు లాగారు.. ప్రాణదాతలుగా మారారు. మృతుల బంధువుల రోదనలు.. క్షతగాత్రుల ఆక్రందనలతో హైవే భయానకంగా మారింది.

కర్నూలు క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నుంచి మొదలైన బస్సు ప్రయాణం డెత జర్నీగా మారింది. హైదరాబాదు-బెంగుళూరు హైవేలో ఉలిందకొండ పోలీస్‌ స్టేషన పరిధిలో చెట్లమల్లాపురం గ్రామ సమీపంలో చిన్నటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3:30గంటలకు కావేరి ట్రావెల్‌ బస్సు ఓమోటారు సైకిల్‌ను ఢీకొట్టి బైకును ఈడ్చుకుంటూ వెళ్లే క్రమంలో మంటలు వ్యాపించాయి. ఈ మంటలు క్రమక్రమంగా బస్సు అంతా వ్యాపించడంతో తప్పించుకునే వీల్లేని విధంగా ఉండటంతో 19మంది ప్రయాణికులు మంటల్లో గుర్తు పట్టలేని విదంగా సజీవ దహనం అయ్యారు. అప్రమత్తమై 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరంతా స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం గమనార్హం. బస్సు డ్రైవర్లలో ఒకరిని పోలీసులు అదుపులో తీసుకోగా, మరొకరు పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

హైదరాబాదు నుంచి బెంగుళూరుకు వెళ్తూ..

హైదరాబాదు నుంచి కావేరి ట్రావెల్‌ బస్సు బెంగుళూరు వెళ్తుంది. హైదరాబాదులో సుమారు 11.30 గంటలకు బయలుదేరింది. కర్నూలుకు వచ్చేసరికి రాత్రి 2.30 నుంచి 3 గంటలై ఉంటుంది. ఉలిందకొండ బైపా్‌సకు వచ్చేటప్పటికి బస్సు వేగం వంద కిలోమీటర్లపైనే ఉంటుంది. ఉలిందకొండ బైపాస్‌ రహదారికి చేరుకునేటప్పటికీ ఈ ట్రావెల్స్‌ బస్సు ముందు ఓ బైకర్‌ వెళ్తున్నాడు. బస్సు ప్రమాదవశాత్తు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న శివశంకర్‌ అక్కడికక్కడే మరణించాడు. ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వేగంగా ముందుకెళ్లాడు. ఈక్రమంలో ఆ బైక్‌ బస్సు కింద ఇరుక్కుకోవడం, ఆవేగంతో బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లాడు. 80మీటర్లు వెళ్లిన తర్వాత బైక్‌-రోడ్డుకు జరిగిన రాపిడిలో చిన్నచిన్న మంటలు వ్యాపించాయి. బస్సు డ్రైవర్‌ కొంత మంటలు వచ్చాయనీ గమనించి కాస్త ముందుకు వెళ్లి ఎడమ వైపునకు తీసుకుని వెళ్లి ఆపాడు. అప్పటికే ప్రధాన డోర్‌ వైపు మంటలు రావడం గుర్తించిన మరో డ్రైవర్‌ను అప్రమత్తం చేసి మంటలు ఆపే ప్రయత్నం చేశాడు. కొన్నిమంటలు ఆరిపోయినట్లుగానే అనిపించి ఒక్కసారిగా మళ్లీ మంటలు వ్యాపించాయి. ప్రధాన డోర్‌ లాక్‌ సిస్టమ్‌ ఫెయిలై డోర్‌ పూర్తిగా మూసుకుపోయింది. ఆ తర్వాత మంటలు ఎక్కువగా వ్యాపించడం, అప్పుడు డ్రైవర్లు ఇద్దరు ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

ప్రయాణికులు నిద్రమత్తులో..

ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో ఐదారు మంది ప్రమాదాన్ని గుర్తించి తోటి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ ఒక్కసారిగా తప్పించుకనే ప్రయత్నం చేశారు. బస్సు డబుల్‌ సీటర్‌తో పాటు ఆ రెండు సీట్ల మధ్య కేవలం ఒక మనిషి వెళ్లే మార్గం ఉండటంతో ఒకరిపై ఒకరు తోసుకున్నారు. వెనుక ఉన్న అద్దాలు తప్ప మినహాయించి మరీ అద్దాలు పగులకొట్టేందుకు వీలు కాలేదు. బెంగుళూరు చెందిన ఓ ముగ్గురు ప్రయాణికులు డ్రైవర్‌ వెనుకాల ఉన్న రెండు అద్దాలను అతికష్టం పగలకొట్టారు. బయటకు వచ్చేందుకు ఐరన గ్రిల్స్‌ ఉండటం, మనిషి దూరే సందు కూడా ఆ గ్రిల్స్‌ మధ్య లేకపోవడంతో అతికష్టమీద బయటపడ్డారు. మిగతా వారంతా వెనుకవైపు వెళ్లాలనే తొందరలో ఒకరిపై ఒకరు తోసుకున్నారు. ఐదారు నిమిషాల్లోనే మంటలు పెద్దఎత్తున బస్సు అంతా వ్యాపించడం, పొగ కమ్ముకోవడంతో తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదం నుంచి 25 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు మాత్రం తప్పించుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో ఒకే కు టుంబానికి చెందిన నలుగురు ఉండటం, చనిపోయిన కుటుంబాల్లో ఒకే కటుంబానికి చెందిన నలుగురు ఉండటం.. ఈ రెండు కుటుంబాలు మిత్రులు కావడం విశేషం.

ఫ మొత్తం బుక్‌ చేసుకున్న ప్రయాణికులు - 40

ఫ బస్సు ఎక్కని ప్రయాణికుడు (తరుణ్‌) - 1

ఫ జడ్చర్ల వద్ద ఎక్కిన ప్రయాణికులు -1

ఫ డ్రైవర్లు -2

ఫ మృతులు 19

ఫ బైకర్‌ -1

ఫ ప్రాణాలతో బయటపడిన వారు 25 మంది

Updated Date - Oct 25 , 2025 | 12:30 AM