Share News

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:10 AM

వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆంజనేయులు(30) మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

    వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
ఆంజనేయులు మృతదేహం పట్టుకొని రోదిస్తున్న సోదరి లక్ష్మి

ప్రభుత్వ ఆసుపత్రిని ముట్టడించిన మృతుడి కుటుంబ సభ్యులు

ఆదోని రూరల్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆంజనేయులు(30) మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారు తెలిపిన వివరాలివీ.. రాయనగర్‌లో నివాసం ఉంటున్న ఆంజనేయులు, రోజమ్మకు ఇద్దరు సంతానం. వెల్డర్‌గా పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో ఆంజనేయులుకు యదనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అతడిని ఇంటికి పంపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికెళ్లిన కొద్దిసేపటికీ ఆంజనేయులు కుప్పకూలాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్‌ ఉన్నప్పటికీ రూంలో నుంచి బయటకు రాలేదని, నర్సులే ఇంజక్షన్లు వేశారని ఆరోపించారు. కనీసం ఈసీజీ కూడా తీయలేదన్నారు. ‘ఆంజనేయులు నీ బిడ్డ పిలుస్తోంది.. ఇంటికెళ్దాం.. మాట్లాడురా ఒకసారి... నన్ను చూడరా... మీ అక్కను వచ్చాను. ఒక సూదితో పొట్టన పెట్టుకున్నారు నిన్ను అంటూ ఆంజనేయులు సోదరి లక్ష్మి రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. టూటౌన, వనటౌన పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వారిని నివారించే ప్రయత్నం చేశారు.

సిబ్బందికి చెప్పకుండా వెళ్లిపోయారు

చెస్ట్‌ పెయిన ఉందని ఆసుపత్రికి వచ్చిన ఆంజనేయులుకు డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది చికిత్సలు చేశారు. కొద్దిసేపటికి వారు సిబ్బందికి చెప్పకుండా వెళ్లిపోయారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదు.

- డాక్టర్‌ పద్మ కుమార్‌, సూపరింటెండెంట్‌

Updated Date - Jul 19 , 2025 | 12:10 AM