Visakhapatnam Police: పశువధ రాకెట్ ఆటకట్టు
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:57 AM
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో గో మాంసం పట్టుపడిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు డీసీపీ-1 వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు.
గో మాంసం కేసులో ముగ్గురి అరెస్టు
విశాఖలోని ఎగుమతిదారు సహా ఇద్దరికి రిమాండ్
ఆనందపురం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపంలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో గో మాంసం పట్టుపడిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు డీసీపీ-1 వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు. గోవులను వధించి మాంసాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారనే సమాచారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇటీవల కోల్‌కతా, గుజరాత్, విశాఖపట్నం తదితర పోర్టుల్లో తనిఖీలు చేసి, మాంసాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పశుసంవర్ధక శాఖకు అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో తనిఖీలు నిర్వహించారు. మి.మిస్ ఓవర్సీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ద్వారా విదేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉన్న మాంసం నుంచి ఆరు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. అందులో మూడు నమూనాలు (87,945 కిలోలు) ఆవు మాంసం, రెండు నమూనాలు (37,656 కిలోలు) ఎద్దు మాంసం, ఒక నమూనా (18,720 కిలోలు) గేదె మాంసంగా తేలిందని డీసీపీ మణికంఠ వెల్లడించారు. గో మాంసాన్ని ఎగుమతిచేస్తున్న మి.మిస్ ఓవర్సీస్ ప్రైవేటు లిమిటెడ్ యజమాని ఎం.డి.ఫర్వాన్‌ను అరెస్టు చేసి విచారించగా దీని వెనుక పెద్ద రాకెట్ ఉందని గుర్తించామన్నారు. గోమాంసం సరఫరాదారులు మన్సూర్ అలీని గుజరాత్‌లో, రషీద్ ఖురోషిని ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టు చేసి తీసుకువచ్చి, రిమాండ్‌కు తరలించామన్నారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.