Visakhapatnam: యూట్యూబ్ చూసి అత్తను చంపిన కోడలు
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:27 AM
తన అత్త చాదస్తంతో వేధిస్తోందని భావించిన ఓ కోడలు.. అత్తను చంపేయాలని నిర్ణయించుకుంది. హత్య చేసి తప్పించుకోవడం ఎలా? అని యూట్యూబ్‌లో వీడియోలు చూసి పక్కా ప్లాన్ వేసింది.
దొంగా పోలీస్ ఆటంటూ పెట్రోల్ పోసి హత్య
అగ్నిప్రమాదమని ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం
విశాఖ జిల్లాలో ఘోరం.. చాదస్తంతో వేధిస్తోందనే!
పెందుర్తి (విశాఖపట్నం), నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): తన అత్త చాదస్తంతో వేధిస్తోందని భావించిన ఓ కోడలు.. అత్తను చంపేయాలని నిర్ణయించుకుంది. హత్య చేసి తప్పించుకోవడం ఎలా? అని యూట్యూబ్‌లో వీడియోలు చూసి పక్కా ప్లాన్ వేసింది. అనుకున్నట్లే ప్లాన్ అమలు చేసి అత్తను హత్య చేసింది. కానీ, చివరకు పోలీసుల విచారణలో దొరికిపోయింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేశారు. ఈ దారుణం వివరాలను ఏసీపీ పృథ్వీతేజ, సీఐ సతీశ్‌కుమార్ వెల్లడించారు. పెందుర్తి మండలం వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్‌లో జయంతి సుబ్రహ్మణ్యం, భార్య లలితాదేవి (30), కుమారుడు ఈశ్వరచంద్ర(10), కుమార్తె శ్రీనయన(8), తల్లి కనకమహాలక్ష్మి(63) నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం పౌరోహిత్యంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. శుక్రవారం రాత్రి పౌరోహిత్యం పనిపై బయటకు వెళ్లినపుడు సుబ్రహ్మణ్యానికి పొరుగు ఫ్లాట్‌లోని వారు ఫోన్ చేసి ‘మీ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. తల్లి కనకమహాలక్ష్మి మరణించారు. కుమార్తె గాయపడడంతో ఆస్పత్రిలో చేర్పిం చాం’ అంటూ చెప్పారు. ఈ సమాచారం తెలిసి సీఐ సతీశ్‌కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరు కుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫ్లాట్‌లో పెట్రోల్ వాసన రావడంతో హత్య కోణంలో అనుమానం బలపడింది. వెంటనే కోడలు లలితాదేవి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. ఆమె యూట్యూబ్‌లో చూసిన వీడియోల్లో హత్య చేసి ఏమార్చడం ఎలా?.. అన్న వీడియోలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇదే సమయంలో భార్య ప్రవర్తనపైనా పోలీసుల వద్ద సుబ్రహ్మణ్యం అనుమానం వ్యక్తంచేశాడు. దీంతో వారు పోలీసులు లలితాదేవిని తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించింది. చాదస్తంతో సూటిపోటి మాటలతో వేధిస్తుండడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది.
దొంగ, పోలీస్ ఆట అని నమ్మించి
అత్తను హత్య చేయడానికి లలితాదేవి ముందస్తు పథకం ప్రకారం ఓ బంక్‌లో పెట్రోలు కొనుగోలు చేసి ఇంటిలో దాచింది. శుక్రవారం తన భర్త బయటకు వెళ్లాక పిల్లలతో దొంగ.. పోలీస్ ఆడాలని అత్తకు చెప్పి సహకరించాలని కోరింది. ఆటలో భాగంగా పిల్లలు వేరే గదిలో దాక్కోగానే, వాలు కుర్చీలో కూర్చుని ఉన్న అత్త కళ్లకు చున్నీతో గంతలు కట్టి, ఆ తరువాత కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసింది. దాచి ఉంచిన పెట్రోల్‌ను అత్తపై పోసి నిప్పంటించింది. క్షణాల్లో మంటలు వ్యాపించి కనకమహాలక్ష్మి సజీవ దహనమైంది. నానమ్మ కేకలు విని బయటకు వచ్చిన శ్రీనయన మంటలు అంటుకుని గాయపడింది. ఈ ఘోరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు లలితాదేవి ఇంటి నుంచి బయటకు వచ్చి అగ్నిప్రమాదం సంభవించిందని, టీవీ పేలి పెద్దశబ్దం వచ్చిందని గగ్గోలు పెడుతూ రక్షించండంటూ ఇరుగుపొరుగు వారి ముందు నాటకం ఆడింది. వారు వచ్చి చూసి అగ్నిప్రమాదంగానే భావించి సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లలితాదేవిని అరెస్టు చేశారు.