Share News

Cyber Commandos: లాఠీతో కాదు.. డేటాతో

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:14 AM

లాఠీ పట్టుకో.. దొంగల్ని వెంబడించు అనేది పాత ధోరణి!.. డేటా సేకరించు.. నేరస్థుల ఆట కట్టించు.. ఇదీ ఏపీలో వైవిధ్యమైన నూతన పోలీసింగ్‌ విధానం!

Cyber Commandos: లాఠీతో కాదు.. డేటాతో

  • ఆధునిక నేరాల కట్టడికి అధునాతన పోలీసింగ్‌

  • ఫ్యూడల్‌ పోలీసింగ్‌ స్థానంలో హ్యూమన్‌ టచ్‌

  • సైబర్‌ కమెండోలుగా ట్రైనీ కానిస్టేబుళ్లు

  • సైబర్‌, ఆర్థిక మోసాలపై నిపుణులతో క్లాసులు

  • ‘ఐ గాట్‌ కర్మయోగి’ యాప్‌తో వీలైనప్పుడల్లా వినొచ్చు

  • 16న దేశంలోనే నంబర్‌ వన్‌ శిక్షణకు సీఎం శ్రీకారం

  • సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్‌లైన్‌: సీఎం

అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): లాఠీ పట్టుకో.. దొంగల్ని వెంబడించు అనేది పాత ధోరణి!.. డేటా సేకరించు.. నేరస్థుల ఆట కట్టించు.. ఇదీ ఏపీలో వైవిధ్యమైన నూతన పోలీసింగ్‌ విధానం! మహిళల మెడలో బంగారు చైన్లు లాక్కెళ్లే స్నాచర్స్‌నే కాదు.. అమాయకుల అకౌంట్లో లక్షలు దోచేసే ముసుగు దొంగల్ని కూడా పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసుల శాఖ నడుం బిగిస్తోంది. ఫ్యూడల్‌ పోలీసింగ్‌కు టాటా చెప్పి హ్యూమన్‌ టచ్‌ తీసుకొస్తామంటున్న పోలీసు ఉన్నతాధికారులు ట్రైనీ కానిస్టేబుళ్లను సైబర్‌ కమెండోలుగా తీర్చి దిద్దబోతున్నారు. శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ నెల 16న శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మంగళగిరిలోని ఏపీ పోలీస్‌ బెటాలియన్స్‌లో 5,551మంది యువత తొమ్మిది నెలల కఠోర, నైపుణ్య శిక్షణకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని డీటీసీలు, పీటీలు, ఏపీఎ్‌సపీ బెటాలియన్లు మొత్తం 20 కేంద్రాల్లో ఈ నెల 22 నుంచి పూర్తి స్థాయిలో శిక్షణకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. కూటమి ప్రభుత్వం 6,024 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి పీటీసీలతో పాటు డీటీసీల్లో మూడు వేల మందికి పైగా సివిల్‌ కానిస్టేబుళ్లుగా ఇప్పుడు శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు 2,500మందికి ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా బెటాలియన్లలో శిక్షణకు ఏర్పాట్లు చేశారు. వీరిలో 810మంది బీటెక్‌, ఎంటెక్‌, బీసీఏ లాంటి టెక్నికల్‌ కోర్సులు చేసిన విద్యావంతులు ఉండగా, డిగ్రీ పట్టభద్రులు 4,051మంది. ఎంబీఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ లాంటి ఉన్నత విద్య చదివిన వాళ్లు కూడా ఉన్నారు.


ఇలాంటి మానవ వనరుల్ని సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాలను ఎదుర్కొనే సుశిక్షిత పోలీసులుగా తీర్చిదిద్దబోతున్నారు. మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ప్రాంగణంలోని టెక్‌ టవర్‌లో ఒక ప్రత్యేక స్టుడియో ఏర్పాటు చేశారు. అక్కడికి సైబర్‌ నిపుణులతో పాటు ఫోరెన్సిక్‌, ఇన్వెస్టిగేషన్‌, ఆర్థిక మోసాలు, మహిళలపై అఘాయిత్యాలు.. తదితర నేరాలపై అవగాహన ఉన్న నిపుణులతో ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పిస్తారు. కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ‘ఐ గాట్‌ కర్మయోగి’ యాప్‌ను ఏపీలోని ప్రతి పోలీసు ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌ ఫోరెన్సిక్‌, క్రిమినాలజీ, సైబర్‌ నేరాలు తదితర సవాళ్లను అధిగమించేందుకు కర్మయోగి యాప్‌ ఉపయోగపడుతుందని పోలీసు శిక్షణ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 04:15 AM