Share News

TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:00 AM

టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాసరి బాబూరావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన పొలంపై లీజు వివాదంతో చింతమనేని ప్రభాకర్‌పై ఆరోపణలు చేస్తూ, తన సమస్య పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నా పొలం లీజుకు తీసుకుని మట్టి తవ్వుకుపోతున్నారు

ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులే పాత్రధారులు

గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేసినా పరిష్కారం కాలేదు

మణికట్టు కోసుకున్న బాధితుడు బాబూరావు

అడ్డుకుని మణిపాల్‌ ఆస్పత్రికి తరలించిన సిబ్బంది

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాసరి బాబూరావు అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆయన అనుచరులు కలిసి తన పొలాన్ని లీజుకు తీసుకుని.. అనుమతి లేకుండా మట్టి తవ్వుకుపోతున్నారని ఆయన ఆరోపించారు. బాబూరావు తన భార్య నాగలక్ష్మితో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో సర్వే నంబరు 12/2, 13/4లోని తమ పదెకరాల పొలాన్ని మాయమాటలతో చల్లచింతలపూడి మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ లీజుకు తీసుకున్నారని, ఆ పొలం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోలుకుపోతున్నారని.. ఈ వ్యవహారంలో చింతమనేని, ఆయన అనుచరులు కీలకంగా ఉన్నారని తెలిపారు. పదెకరాల్లో ఇప్పటికే 4 ఎకరాల్లో మట్టి తవ్వేశారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గనుల శాఖ తనకు రూ.1.25 కోట్లు ఫైన్‌ వేసిందని తెలిపారు. ఈ వ్యవహారంపై టీడీపీ గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, ఇక ఆత్మహత్యే శరణమ్యంటూ మణికట్టు కోసుకున్నారు. టీడీపీ కార్యాలయ సిబ్బంది అడ్డుకుని ఆయన్ను మణిపాల్‌ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Apr 22 , 2025 | 05:00 AM