Share News

Kakinada: ఆ దివ్వెల వెనుక చీకటి

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:50 AM

బాణసంచా తయారీ కేంద్రాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఏడాది మొత్తం బాణసంచా పెద్దఎత్తున తయారవుతూ ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

Kakinada: ఆ దివ్వెల వెనుక చీకటి

  • తయారీ కేంద్రాల్లో బతుకులు బుగ్గి

  • దీపావళికి తరచూ ప్రమాదాలు

  • ‘తూర్పు’లో ఏటా 40 మంది బలి

  • ప్రమాదాల్లో అధికంగా చనిపోతోంది మహిళలు, పిల్లలే

  • రాష్ట్రంలో 80శాతం బాణసంచా తయారీ గోదావరి జిల్లాల్లోనే

  • ఏటా రూ.350 కోట్లకుపైగా టర్నోవర్‌

  • అనధికార తయారీ కేంద్రాలే అత్యధికం

  • అధికారులకు మామూళ్లు ఇచ్చి సర్దుబాటు

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

బాణసంచా తయారీ కేంద్రాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఏడాది మొత్తం బాణసంచా పెద్దఎత్తున తయారవుతూ ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా దీపావళి సమయంలో రూ. కోట్లలో వచ్చే ఆర్డర్ల కోసం తయారీదారులు తక్కువ కూలీ ఇచ్చి మహిళలు, పిల్లలను పనిలో పెట్టుకుంటున్నారు. ఏమాత్రం నైపుణ్యం లేక చేసే తప్పిదాలతో అనేకమంది దుర్మరణం పాలవుతున్నారు. రాష్ట్రం మొత్తంమీద ఎనభై శాతం మందుగుండు తయారీ ఒక్క ఈ జిల్లాలోనే జరుగుతోంది. కొమరిపాలెం... వేట్లపాలెం... ద్రాక్షారామం... గొల్లప్రోలు.. పెదపూడి మందుగుండు తయారీ అడ్డాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వివాహాలు, రాజకీయ సభలు, కార్యక్రమాలు, జాతర్లు, తీర్థాలు, పండగలు జరిగినాఇక్కడి నుంచి సరుకు వెళ్లాల్సిందే. మల్లిపందిరి, రన్నింగ్‌ బాల్‌, ఈతచెట్టు, విషసర్పం తదితర మందుగుండు పేలుడు ప్రదర్శనల్లో తూర్పుగోదావరి బాణసంచాయే ప్రధాన ఆకర్షణ. పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఏటా రూ.60కోట్లకుపైగా విలువైన మందుగుండు తయారవుతోంది బుధవారం బాణసంచా ప్రమాదం జరిగి ఏడుగురు దుర్మరణం పాలైన రాయవరం, ఆ పక్కనే అనపర్తి, మండపేట నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో తయారీ పరిశ్రమలు నడుస్తున్నాయి. ఈ పరిశ్రమ వార్షిక టర్నోవర్‌ రూ.250కోట్లపైనే. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, కడియద్ద, వేల్పూరు.. మీనానగరం కేంద్రాల టర్నోవర్‌ కూడా కలిపితే వ్యాపారం రూ.350కోట్లు దాటుతుంది.


ఈ మోత గోదావరిలోనే ఎందుకు?

మందుగుండు తయారుచేసే కొన్ని కుటుంబాలు దాదాపు వందేళ్ల నుంచీ ఇదే వ్యాపారంలో ఉన్నాయి. గోదావరి జిల్లాల్లోనే ఈ పరిశ్రమ ఎదగడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... మందుగుండు భారీ వినియోగం గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ పెళ్లి వేడుక జరిగిందంటే గంట నుంచి రెండు గంటలపాటు మందుగుండు మోతెక్కి పోవాల్సిందే. అలాగే తరచూ ఈ జిల్లాలో పండగలు, జాతర్లు, తీర్థాలు జరుగుతుంటాయి. రాజకీయ సభలు, కార్యక్రమాలు, ర్యాలీల్లోను వీటి వినియోగం అధికం. మందుగుండు తయారీ కేంద్రాలకు నీటి లభ్యత అవసరం కావడం రెండో కారణం. వేట్లపాలెంలోని ఐదు బాణసంచా తయారీ పరిశ్రమలూ గోదావరి కాలువకు సమీపంలోనే ఉన్నాయి. గొల్లప్రోలు తయారీ కేంద్రం సుద్దగడ్డ కాలువకు సమీపంలో ఉంది.

ఇదే కేంద్రంలో 35 ఏళ్ల క్రితం ప్రమాదం

రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో సరిగ్గా 35 ఏళ్ల కిందట ఇదే తరహా విస్ఫోటనం జరిగింది. అప్పట్లో భారీగా ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఏటా 40 మంది ఇదే తరహాలో మరణిస్తున్నారు. నిజానికి, బాణసంచా తయారీ కేంద్రాల్లో అనుమతులు లేనివే అధికం. పిల్లలు, మహిళలు పనిచేస్తున్నారా అనేది..చెక్‌ చేసే బాధ్యత కార్మికశాఖది. కానీ, పట్టించుకోరు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులకు ఓనర్లు మామూళ్లు ఇస్తూ సర్దుబాటు చేసుకుంటున్నారు. లొసుగులు బయటపడకుండా ప్రభుత్వ యంత్రాంగంలో పై నుంచి కింది దాకా టపాసుల గిఫ్ట్‌ ప్యాక్‌లు అందిస్తున్నారు.


ఏదీ అప్రమత్తత?

  • బాణసంచా తయారు కేంద్రాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులనే నియమించాలి. అయితే, వారికి అధిక వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా మామూలు కూలీలతో పనులు చేయిస్తున్నాయి.

  • మందుగుండు తయారీలో నిర్దిష్ట దూరం పాటించాలి. చేతికి గ్లౌజులు వేసుకోవాలి. కానీ ఇదేదీ అమలు కావు.

  • దీపావళి సీజన్‌లో నిర్వాహకులు రెట్టింపుస్థాయిలో బాణసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం కనీస పరిజ్ఞానం లేని కార్మికులను డంప్‌ చేసేస్తున్నారు.

  • మహిళలు, పిల్లలను బాణసంచా తయారీకి వినియోగించరాదని నిబంధన ఉంది. కానీ, తక్కువ కూలీకి వస్తారనే కారణంగా వీరినే యజమానులు పనికి పెట్టుకుంటున్నారు.

  • మందుగుండు తయారీ కేంద్రాల్లో పనిచేస్తున్న కూలీలకు బీమా సదుపాయం కల్పించాలని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ అనేక కంపెనీలు ఇప్పటికీ దీన్ని అమలు చేయడం లేదు.

Updated Date - Oct 09 , 2025 | 03:51 AM