ట్రయల్ రనలోనే డమాల్
ABN , Publish Date - May 07 , 2025 | 11:26 PM
ఎనిమిదేళ్ల శ్రమ, లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు ట్రయల్ రనలోనే బుధవారం మధ్యాహ్నం ఒకసారిగా కుప్పకూలింది.
ప్రయోగాత్మక దశలోనే కూలిన ఓబర్ హెడ్ ట్యాంకు
త్రుటిలో తప్పిన ప్రమాదం
విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్
మంత్రాలయం, మే 7 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ల శ్రమ, లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు ట్రయల్ రనలోనే బుధవారం మధ్యాహ్నం ఒకసారిగా కుప్పకూలింది. 2017లో రూ.9.80 కోట్ల నాబార్డు నిధులతో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు, మైక్రో ఫిల్టర్స్, సంపు పనులను నెల్లూరుకు చెందిన జీపీఆర్ కనస్ట్రక్షన చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని రాఘవేంద్రపురం శివారులో దాదాపు రూ.25 లక్షల ఖర్చుతో 60వేల లీటర్ల నీటి సామర్థ్యంతో ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించారు. అప్పట్లోనే నాణ్యత సరిగ్గా లేదని టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. దాంతో కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరు కాలేదు. కాంట్రాక్టరు కూడా కోర్టును ఆశ్రయించారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ వివాదం కోర్టు పరిధిలో ఉంది. జలజీవన, ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 15 రోజులుగా సూగూరు ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి ఓవర్ హెడ్ ట్యాంకుకు నీటిని వదులుతూ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ దశలోనే ట్యాంకు ఒక్కసారిగా కూలిపోయి నేలమట్టమైంది. పెద్ద శబ్దం రావడంతో సమీప కాలనీవాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని పక్కనే 11కేవీ విద్యుత వైర్లు ఉన్నాయి. ఈ ట్యాంకు కింద పైన నిత్యం యువకులు, విద్యార్థులు ఆటాడకుంటూ ఉండేవారు. మధ్యాహ్న సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పద్మజ, డీఈ మైనుద్దీన, ఏఈఈ వెంకట్రాముడు, పంచాయతీ సెక్రటరీ ఇస్రత బాషా, షాహీన, వైస్ ఎంపీపీ రాఘవేంద్ర, ఎంపీటీసీలు వెంకటేశ శెట్టి, మేకల వెంకటేశ, ఉప సర్పంచ హోటల్ పరమేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శివకృష్ణ, కవిత పరిశీలించారు. ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతోనే కూలిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నిర్మాణం సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే కూలిపోయిందని పలు పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.
విచారణ చేపట్టండి : పవన కల్యాణ్ ఆదేశాలు
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర కాలనీలో ఓవర్‌హెడ్ ట్యాంక్ కూలిన ఘటనపై విచారణ చేయాలని ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్ బుధవారం ఆదేశాలిచ్చారు. ట్యాంక్ కూలిన విషయం ఉపముఖ్యమంత్రికి తెలియగానే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కూలిన సమయంలో పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఇలాంటి పరిస్థితులు రాకూడదని, ఈ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలపై విచారణ చేసి నివేదిక వెంటనే పంపాలని ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకుల నాణ్యతను పరిశీలించి సమగ్ర నివేదికను అందించాలని సూచించారు.