Minister Janardhan Reddy: దెబ్బతిన్న రోడ్లకే తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:54 AM
రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆర్‌అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు.
నిర్మాణాలను వేగంగా పూర్తి చేయండి
బిల్లులు చెల్లిస్తాం..పనుల్లో వేగం పెంచండి
కాంట్రాక్టర్ల భేటీలో మంత్రి జనార్దన్‌రెడ్డి వెల్లడి
విజయవాడ సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆర్‌అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఎన్‌డీబీ (న్యూ డెవల్‌పమెంట్ బ్యాంకు) నిధులతో చేపట్టిన రోడ్డు పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో మంత్రి విజయవాడ ఈఎన్‌సీ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లిస్తే నాణ్యతా ప్రమాణాలతో పనులు నిర్ణీత వ్యవధిలోనే పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టర్లు ఈ భేటీలో మంత్రికి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ...గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన ఎన్‌డీబీ రోడ్ల పనులను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించిందని తెలిపారు. ‘‘రూ.1,680.97 కోట్లతో 682 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని నిర్ణయించాం. ఇందులో 546 కిలోమీటర్ల పనులు ప్రారంభించి...ఇప్పటివరకు 236 కిలోమీటర్ల పనులు పూర్తి చేశాం. దీనికిగాను రూ.434 కోట్ల బిల్లులు చెల్లించాం. ఇంకా రూ. 313.98 కోట్లు చెల్లించాలి. వాటిని కూడా త్వరలోనే చెల్లిస్తాం’ అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.