దెబ్బతిన్న మాచ్‌ఖండ్ రిటైనింగ్ వాల్
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:52 PM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన పవర్ కెనాల్ రిటైనింగ్ వాల్ నీటి ఉధృతికి భారీగా కోతకు గురైంది. దీంతో జలవిద్యుత్ కేంద్రానికి సొరంగ మార్గం నుంచి నీటిని సరఫరా చేసేందుకు ప్రాజెక్టు అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నీటి ఉధృతికి కోతకు గురైన పవర్ కెనాల్ గోడ
విద్యుదుత్పాదనకు నీటి సరఫరా కోసం తప్పని ఇబ్బందులు
ముంచంగిపుట్టు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన పవర్ కెనాల్ రిటైనింగ్ వాల్ నీటి ఉధృతికి భారీగా కోతకు గురైంది. దీంతో జలవిద్యుత్ కేంద్రానికి సొరంగ మార్గం నుంచి నీటిని సరఫరా చేసేందుకు ప్రాజెక్టు అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
డుడుమ జలాశయం పవర్ గేట్లు సక్రమంగా పని చేయకపోవడంతో ఈ నెల 2వ తేదీన సీలేరు కాంప్లెక్స్ ప్రాజెక్టు ఉన్నతాధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. రెండు గేట్ల పరిశీలనలో భాగంగా తెరిపించే సమయంలో ఒక్కసారిగా నీరు ఉధృతంగా ప్రవహించింది. గేట్లను మూసేందుకు ప్రయత్నించినా మూసుకోలేదు. దీంతో నీరు ఉధృతంగా వెళ్లి పవర్ కెనాల్‌కు చెందిన రిటైరినింగ్ వాల్‌ను బలంగా తాకడంతో సుమారు 15 అడుగులు కోతకు గురైనట్టు తెలిసింది. అలాగే పలు చోట్ల కెనాల్ గోడలకు రంధ్రాలు ఏర్పడ్డాయి. దీంతో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి సొరంగ మార్గం నుంచి నీటిని సరఫరా చేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే నీరు వృథాగా బయటకుపోతోంది. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ప్రారంభించిన తొలినాళ్ల నుంచి నేటి వరకు అంటే సుమారు 70 ఏళ్లు కావస్తున్నా కెనాల్ మరమ్మతు పనులు చేపట్టకపోవడం, రెండు పవర్ గేట్ల మరమ్మతు పనులు మొక్కుబడిగా చేయడం వలన ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడినట్టు తెలిసింది. జలాశయం గేట్లు, పవర్ గేట్లు వేసవి కాలంలో నీరు తక్కువగా ఉన్న సమయంలో వాటి బాగోగులపై దృష్టి సారించాల్సి ఉండగా, ప్రాజెక్టు అధికారులు దానికి విరుద్ధ్దంగా జలాశయాల్లో వరదనీరు అధికంగా ఉన్న సమయంలో పవర్ గేట్ల మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రయత్నించడం వలన భారీ మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నా ప్రాజెక్టు అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ప్రాజెక్టు కార్మికులు మాత్రం దెబ్బతిన్న రిటైనింగ్ వాల్ రంధ్రాలను పూడ్చేందుకు శ్రమిస్తున్నారు.