Share News

First Vice Chancellor: తెలుగు విశ్వవిద్యాలయం తొలి వీసీగా మునిరత్నం నాయుడు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:20 AM

శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్‌చాన్సలర్‌గా ఆచార్య డి.మునిరత్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు.

First Vice Chancellor: తెలుగు విశ్వవిద్యాలయం తొలి వీసీగా మునిరత్నం నాయుడు బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్‌చాన్సలర్‌గా ఆచార్య డి.మునిరత్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం (బొమ్మూరు పీఠం)లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రిజిస్ర్టార్‌, ఇతర ప్రధాన విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది నియామకాలు పూర్తి చేసి, జనవరి నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 22 ముఖ్య విభాగాలు ఉన్నాయని, అందులో భాషాపీఠం, చరిత్ర-సంస్కృతి పీఠం ముఖ్యమైనవని తెలిపారు. విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం కేంద్రంలో తెలుగు ఎం.ఏ, శ్రీశైలంలో సంస్కృతి-చరిత్ర విభాగాల్లో ఎంఏ, పీహెచ్‌డీ, కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో నృత్యానికి సంబంధించిన సర్టిఫికెట్‌, డిప్లమో కోర్సులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్చచౌదరి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం తన పరిధిలో రూ.30 లక్షలు నిధులు సమీకరించినట్టు చెప్పారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ త్వరలో విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అవసరమైన గ్రాంట్‌ విడుదల చేయనున్నట్టు ఆయన వివరించారు.

Updated Date - Oct 24 , 2025 | 05:21 AM