Share News

Visakhapatnam: బంగాళాఖాతంలో వాయుగుండం

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:39 AM

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం వాయుగుండంగా బలపడింది.

Visakhapatnam: బంగాళాఖాతంలో వాయుగుండం

  • కళింగపట్నానికి 110 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

  • నేటి ఉదయం తీరం దాటే అవకాశం

  • నాలుగు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం

  • ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక

విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 40 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా, కళింగపట్నానికి 110 కిలోమీటర్లు ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ఉత్తరంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడి మంగళవారం ఉదయం గోపాల్‌పూర్‌కు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవన ద్రోణి తూర్పు భాగం జగదల్‌పూర్‌ మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించింది. దీనికితోడు విజయనగరం, శ్రీకాకుళం సరిహద్దుల నుంచి షీర్‌జోన్‌ తూర్పు, పడమర దిశగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో అలలు ఎగిసిపడుతుండడం, కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.


భారీ వర్ష సూచన

కుంభవృష్టి: శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, పార్వతీపురం మన్యం

భారీ నుంచి అతి భారీ వర్షాలు: విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానాం, తూర్పు, ఏలూరు జిల్లాల్లో

భారీ వర్షాలు: కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం, కర్నూలు జిల్లా వరకూ

Updated Date - Aug 19 , 2025 | 03:41 AM