Weather Alert: అండమాన్‌లో బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంఅండమాన్‌లో బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనం
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:11 AM
దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి బలపడి వాయుగుండంగా మారింది.
28 నుంచి పెరగనున్న వర్షాలు: ఐఎండీ
విశాఖపట్నం/అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి బలపడి వాయుగుండంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడనుంది. ఆ తర్వాత మధ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత 3రోజుల్లో వాయవ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానున్నది. ఆ తర్వాత కూడా ఉత్తరం/వాయవ్యంగా పయనించి కోస్తాంధ్ర వైపు పయనించి దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటుతూ బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడ భారీగా, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఈనెల 30, డిసెంబరు ఒకటి తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 2, 3 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 27వ తేదీ నుంచి దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోస్తా, రాయలసీమల్లో వరి, పత్తి రైతులు ఈనెల 28వ తేదీ నుంచి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. కోతలను మూడు, నాలుగు రోజులు వాయిదా వేయాలని సూచించారు. రైతులు పొలాల్లో వరి కుప్పల రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.