Cyclones: వస్తే... విధ్వంసమే
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:00 AM
తుఫాన్ వచ్చిందంటే వణుకు మొదలవుతుంది. తీరం దాటేసరికి ఆ ప్రాంతం కకావికలమవుతుంది. వాటి తీవ్రతను బట్టి నష్టం పెరుగుతుంటుంది.
ఒక్కో తుఫాన్ తీవ్రత ఒక్కోలా.. విశాఖను వణికించిన హుద్‌హుద్
ఆ తర్వాత తితిలీతోనూ ముప్పు
వాటికంటే మొంథా తీవ్రత తక్కువ
కానీ... పరిధి, విస్తృతి అధికం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తుఫాన్ వచ్చిందంటే వణుకు మొదలవుతుంది. తీరం దాటేసరికి ఆ ప్రాంతం కకావికలమవుతుంది. వాటి తీవ్రతను బట్టి నష్టం పెరుగుతుంటుంది. పదకొండేళ్ల క్రితం విశాఖకు తాకిన హుద్‌హుద్, ఏడేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలో తితిలీ ఇలాంటి విధ్వంసాలనే మిగిల్చాయి. ఆ తర్వాత... ఇప్పుడొచ్చిన ‘మొంథా’ అదే స్థాయిలో భయపెట్టింది. అయితే... హుద్‌హుద్, తితిలీతో పోల్చితే మొంథా తీవ్రత తక్కువే. ఇవీ ఆ తుఫాన్లు... అవి సృష్టించిన విధ్వంసాలు...
అమ్మో... హుద్‌హుద్
హుద్‌హుద్ పేరు వింటే విశాఖ వాసులు ఇప్పటికీ వణికిపోతారు. 2014 అక్టోబరు 12న హుద్‌హుద్ తుఫాన్ విశాఖపట్నాన్ని తాకిన సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచాయి. తూర్పు నౌకాదళం, విశాఖ ఓడరేవులో కొద్దిసేపు 245 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. విశాఖ నగరం కకావికలమైంది. చెట్లు, స్తంభాలు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విశాఖలో పోర్టు, నేవీ, షిప్‌యార్డు, హెచ్‌పీసీఎల్, విశాఖ ఉక్కు కర్మాగారంతోపాటు, ఎయిర్‌పోర్టు, ఇతర పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. హుద్‌హుద్ తుఫాన్ తీరం దాటిన తరువాత వాయవ్యంగా పయనించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బిహార్ మీదుగా నేపాల్ వరకు వెళ్లింది. హుద్‌హుద్ తుఫాన్ ప్రభావంతో మొత్తం 124 మంది (ఏపీలో 89 మంది) ప్రాణాలు కోల్పోగా, రూ. 21 వేల కోట్లకుపైగా ఆస్తినష్టం వాటిల్లింది. ఇందులో మూడో వంతు నష్టం పరిశ్రమలదేనని అప్పట్లో అంచనా వేశారు.
తీవ్రంగా తితిలీ గాలులు..
2018 అక్టోబరు 10న శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద తితిలీ తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో గాలులు గంటకు 150 కి.మీ. వేగంతో వీచాయి. కొద్దిసేపు 185 కి.మీ. వేగానికికూడా చేరాయి.ఈ తుఫాన్ శ్రీకాకుళంజిల్లాతోపాటు పొరుగునున్న ఒడిశాపైనా తీవ్రప్రభావం చూపింది. ఏపీ, ఒడిశాల్లో రూ. 6,300 కోట్ల ఆస్తినష్టం వాటిల్లగా 127 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొంథా ప్రత్యేకత వేరు
హుద్‌హుద్, తితిలీతో పోల్చితే... మొంథా తుఫాన్ తీవ్రత తక్కువే. కానీ... పరిధి ఎక్కువ. మొంథా తీరం దాటినప్పుడు గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒక్కోసారి ఆ వేగం 110 కిలోమీటర్లను చేరింది. హుద్‌హుద్, తితిలీవల్ల ఏపీలో కేవలం ఉత్తరాంధ్రలోనే వర్షాలు కురిశాయి. కానీ... మొంథా ప్రభావం కోస్తాంధ్రతీరంతో పాటు, రాయలసీమలోనూ ప్రభావం చూపింది. ఇంకా...తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌లలోనూ భారీవర్షాలు నమోదయ్యాయి. హుద్‌హుద్ సమయంలో రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో సముద్రం నుంచి భూఉపరితలంపైకి గాలులు తప్ప తేమ తక్కువగా రావడంతో ఉత్తరాంధ్రలో మాత్రమే వర్షాలు కురిశాయి. మొంథాకు బలమైన ఈశా న్య రుతుపవనాలు తోడయ్యాయి. హిందూ మహాసముద్రంలో తుఫాన్‌లకు అనుకూల వా తావరణం నెలకొంది. దీనివల్లే మొంథా పరిధి పలు రాష్ట్రాలకు విస్తరించిందని వాతావరణ విభాగం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు.