AP Roads Crisis: రహదారులపై విపత్తుల పగ!
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:27 AM
డబ్బు కట్టి ప్రయాణించే టోల్ రోడ్లను పక్కన పెట్టి... ఇతర రోడ్లపై సాఫీగా ప్రయాణం సాగుతోందంటే వాళ్లు అదృష్టం చేసుకున్నట్లే! ‘ఆహా ఏమి ఈ భాగ్యం’ అని మురిసిపోవాల్సిందే! అవును...
రాష్ట్రంలో రహదారులకు వరదలు, తుఫాన్ల దెబ్బ
జగన్ హయాంలో ఐదేళ్లు దారులన్నీ ధ్వంసమే
కనీస నిర్వహణకు నోచుకోక నరకానికి నకళ్లు
వివిధ పథకాలకింద వచ్చిన నిధులూ మళ్లింపు
గోతుల్లేని రోడ్లకు కూటమి సర్కారు ప్రాధాన్యం
ఏడాదిలోనే గుంతలు పూడ్చేందుకు 2 వేల కోట్లు
అంతలోనే వర్షాలు, తుఫాన్లతో దారులకు దెబ్బ
వాటిని బాగుచేసేలోపే మళ్లీ ‘మొంథా’ విలయం
దెబ్బతిన్న 3,388 వంతెనలు, 31వేల కి.మీ రోడ్లు
తక్షణ మరమ్మతులకు 1,700 కోట్లు అవసరం
పూర్తిగా బాగుకు రూ.6,150 కోట్లు కావాలి
నాడు జగన్ సర్కారు ఐదేళ్లూ రహదారులను గాలికొదిలేసింది. రోడ్ల బాగుకు రూపాయి కూడా ఖర్చుపెట్టని పరిస్థితి. కూటమి సర్కారు రహదారుల నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తూ... ఒకే ఏడాది రూ.2వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ... ఏం లాభం! వరుస వర్షాలు, వరదలు, తుఫాన్ల దెబ్బకు రహదారుల పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. ఎన్ని ప్యాచ్‌వర్క్‌లు చేసినా... అది మట్టిపాలే అవుతోంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): డబ్బు కట్టి ప్రయాణించే టోల్ రోడ్లను పక్కన పెట్టి... ఇతర రోడ్లపై సాఫీగా ప్రయాణం సాగుతోందంటే వాళ్లు అదృష్టం చేసుకున్నట్లే! ‘ఆహా ఏమి ఈ భాగ్యం’ అని మురిసిపోవాల్సిందే! అవును... రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్రంలో 31వేల కిలోమీటర్ల పరిధిలో గడబిడగా సాగే గతుకుల ప్రయాణమే! కూటమి సర్కారు వచ్చీ రాగానే రూ.2000 కోట్ల ప్రత్యేక నిధులతో గుంతలు పూడ్చే పనులు చేపట్టింది. ఆ పనులు పూర్తయి, కుదురుకునేలోపే వర్షాలు, తుఫానులు రోడ్లను తుడిచిపెట్టేశాయి. ఫలితంగా రోడ్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇక రహదారి వంతెనలు మరీ ఘోరంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే రూ.1700 కోట్లు ఖర్చుపెడితేనే దారులు గాడిన పడతాయి. శాశ్వత ప్రాతిపదికన మరో రూ.6150 కోట్లు వ్యయం చేస్తే తప్ప ధ్వంసమైన రోడ్లు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
రోడ్లకు పాతరేసిన జగన్...
రాష్ట్ర ప్రభుత్వం ఏటా 8 వేల కిలో మీటర్ల రహదారుల నిర్వహణ చేపట్టాలి. ఇందుకోసం ఏటా రూ.2వేల కోట్లపైనే ఖర్చవుతుంది. కానీ, జగన్ సర్కారు రహదారుల నిర్వహణను పూర్తిగా వదిలేసింది. దీంతో రహదారుల పరిస్థితి ఘోరంగా మారింది. వర్షాలు, తుఫానులకు రోడ్లు దెబ్బతినడం ఒక ఎత్తయితే, నిర్వహణ లేక గోతులు పడి ఘోరంగా ధ్వంసం కావడం మరో ఎత్తు. రహదారుల నిర్వహణకు కేంద్రం నాలుగు పథకాల కింద ఇచ్చిన రూ.3200 కోట్లను కూడా జగన్ సర్కారు దారిమళ్లించింది. దీంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2023లో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చి 2800 కిలోమీటర్ల పరిధిలో గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. అది కూడా వాహనదారులు పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వానికి చెల్లించే 2 రూపాయల రహదారి భద్రత సెస్‌ను బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణం తీసుకొచ్చారు. ఆ రుణంతో వేసిన రహదారులు ఎనిమిది నెలలు కూడా ఉండలేదు. ఆర్‌ఐడీఎఫ్, ఎన్డీబీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇతర స్కీమ్‌ల కింద ఐదేళ్లలో రూ.12వేల కోట్లపైనే వచ్చాయి. వాటిని జగన్ సర్కారు రోడ్లపై కన్నా ఇతర బటన్ నొక్కుడు పథకాలపై ఖర్చుపెట్టింది.
నేడు విపత్తుల పగ...
కూటమి సర్కారు వచ్చే నాటికి ఆర్‌అండ్‌బీలో కాంట్రాక్టర్లకు చెల్లించే బకాయిలు రూ.2300 కోట్లు ఉన్నాయి. ఇక కొత్త పనులు చేయడానికి, రహదారుల నిర్వహణకు ఆర్‌అండ్‌బీ వద్ద దమ్మిడి కూడా లేదు. రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) నిధులు కూడా ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ కూటమి సర్కారు రహదారుల నిర్వహణకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. ఇతర స్కీమ్‌లు, పద్దుల కింద ఉన్న నిధుల్లో నుంచి 2000 కోట్లు ఆర్‌అండ్‌బీకి ఇచ్చింది. ఏడాది కాల వ్యవధిలో 7800 కిలోమీటర్ల పరిధిలో గుంతలను పూడ్చేసింది. బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం భరోసా ఇచ్చిన తర్వాతే.... కాంట్రాక్టర్లు ఈ పనులు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు 1600 కోట్లపైనే పాత బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో కాంట్రాక్టర్లు ఆర్‌అండ్‌బీ వర్క్‌లు చేసేందుకు మళ్లీ ఆసక్తిచూపుతున్నారు. ప్రభుత్వం ఏడాదంతా కష్టపడి రహదారులపై గుంతలు పూడుస్తున్న క్రమంలోనే... రాష్ట్రంలో జూలై నుంచి కురిసిన భారీ వర్షాలకు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వర్షాల కారణంగా సెప్టెంబరు వరకు 1800 కిలోమీటర్ల మేర జిల్లా ప్రధాన, రాష్ట్ర ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వాటిపై గుంతలు పూడ్చి ప్రయాణాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రభుత్వం 670 కోట్లు ఖర్చుచేసేందుకు టెండర్‌లు పిలిచింది. వర్క్‌లు కూడా జరుగుతున్న దశలో మళ్లీ మొంథా తుఫాను విరుచుకుపడింది. దీని దెబ్బకు రాష్ట్రంలో మరో 31వేల కిలోమీటర్ల గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులు... 3388 వంతెనలు ధ్వంసం అయ్యాయి. 838 వంతెనలు మరమ్మతులకు సాధ్యంకానంతగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు తాత్కాలికంగానే రూ.1700 కోట్లు ఖర్చవుతుందని ఆర్‌అండ్‌బీ ప్రభుత్వానికి నివేదించింది. 4229 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులకు కూడా వీలుకానంతగా ధ్వంసమయ్యాయి. వాటి పునర్ నిర్మాణానికి కనీసం రూ.2300 కోట్లు కావాలని ఆర్‌అండ్‌బీ సర్కారుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. మరమ్మతులకు వీలుకానంతగా దెబ్బతిన్న వంతెనల నిర్మాణానికి మరో 3,850 కోట్ల నిధులు అవసరమని పేర్కొంది. దీనికి 16వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకోవాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదించింది.
రోడ్లపై ఖర్చుకు వెనుకాడం
‘రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఉండాలన్నది మా ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు గుంతలు, ప్యాచ్‌లు పూడ్చే పనులకు 2వేల కోట్లు ఖర్చు చేశాం. మరో 2500 కోట్లతో జిల్లాల్లో కొత్త రహదారుల నిర్మాణంకోసం టెండర్లు పిలుస్తాం. జగన్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఎన్డీబీ వర్క్‌లను పునరుద్ధరిస్తాం. ఇటీవలే కాంట్రాక్టర్లతో సమావేశమై... పనులు ప్రారంభించాలని కోరాం. వర్షాలు, తుఫానులతో ధ్వంసమైన రహదారుల మరమ్మతులు, నిర్వహణకోసం నిధులు సమీకరిస్తాం. కేంద్రానికి నివేదికలు పంపించాం. విపత్తు సహాయ నిధి నుంచి వచ్చే డబ్బుతో రహదారి మరమ్మతు పనులు వెంటనే చేపడతాం.’’
- బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి
ఇవీ చదవండి:
బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
హీరో, టీవీకే చీఫ్ విజయ్‌కి పోలీసుల షాక్... ఆయన ప్రచారానికి..