Heavy Rainfall: కోస్తాకు తుఫాన్ ముప్పు
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:36 AM
కోస్తాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మొదట పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో...
బంగాళాఖాతంలో అల్పపీడనం
నేడు వాయుగుండంగా, రేపు రాత్రికి తుఫాన్‌గా బలపడే చాన్స్
29న కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరంపైకి?.. నేడు, రేపు భారీవర్షాలు
27, 28 తేదీల్లో కుంభవృష్టి!.. ప్రకాశం జిల్లాలో వాగులో విద్యార్థి గల్లంతు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కోస్తాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మొదట పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో శనివారానికి వాయుగుండంగా, ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్నది. ఆ తర్వాత ఆదివారం అర్ధరాత్రి తర్వాత తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇది వాయవ్యంగా పయనించి ఈ నెల 28వ తేదీ నాటికి మధ్య, ఉత్తర కోస్తా దిశగా రానున్నదని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడి 28వ తేదీ అర్ధరాత్రి లేదా 29వ తేదీ తెల్లవారుజామున మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటనున్నదని అంచనా వేశారు. అయితే కొన్ని మోడళ్ల ప్రకారం విశాఖపట్నం-కాకినాడ మధ్య, ఇంకొన్ని మోడళ్ల విశ్లేషణ మేరకు దక్షిణ ఒడిశాలో తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేశారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో 7.1, కోనసీమ జిల్లా అమలాపురంలో 6.3, అల్లూరి జిల్లా బుట్టాయిగూడెం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 5.5, నంద్యాల జిల్లా రంగాపురంలో 4.8, కడప జిల్లా బద్వేల్‌లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ తుఫానుకు థాయ్‌లాండ్ దేశం సూచించిన ‘మొంతా’ (ఎంఓఎన్‌టీహెచ్‌ఏ) అని పేరు పెట్టనున్నారు. మరోవైపు తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది.
అన్నదాతల్లో ఆందోళన
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి, వేరుశనగ, తదితర పంటలు పక్వానికి వచ్చి ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో గింజ పాలు పోసుకునే దశ నుంచి పొట్ట దశలో ఉంది. ముదురు పంట కోతకు రైతులు సిద్ధమవుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో పత్తి తీస్తుండగా, వేరుశనగ కాయ దశలో ఉంది. మిర్చి ఎదుగుదల దశలో ఉంది. ఈ తరుణంలో తుఫాన్ వల్ల భారీ వర్షాలు కొనసాగితే.. లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. 1987 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సంతనూతలపాడు మండలం తొర్రగుడిపాడు సమీపంలో ఒక విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. ఒంగోలు నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. తుఫాన్ ముప్పు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి అనిత ఆదేశించారు. అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు.