Unexpected Path: మొంథా రూటే సెపరేటు
ABN , Publish Date - Oct 30 , 2025 | 06:49 AM
మొంథా భిన్నమైన తుఫాను అని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. తుఫాన్ తీరం దాటిన ప్రాంతం విషయంలో భారత వాతావరణ శాఖ అధికారులు చాలాసేపు తర్జనభర్జన పడ్డారు.
అన్ని అంచనాలను కాదని నరసాపురం వద్ద తీరం దాటిన తుఫాను
(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)
మొంథా భిన్నమైన తుఫాను అని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. తుఫాన్ తీరం దాటిన ప్రాంతం విషయంలో భారత వాతావరణ శాఖ అధికారులు చాలాసేపు తర్జనభర్జన పడ్డారు. కాకినాడకు దక్షిణంగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ మూడు రోజుల క్రితం నుంచి చెబుతూ వచ్చింది. హంసలదీవి, అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకినట్లు బుధవారం అంచనాలు వెలువడ్డాయి. చివరకు నరసాపురంలోని వాతావరణ శాఖ అబ్జర్వేటరీ కేంద్రంలో నమోదైన గాలులు, పీడనం వివరాలను పరిగణనలోకి తీసుకుని అక్కడకు సమీపంలో తీరం దాటిందని ప్రకటించింది. తుఫాన్ పడమర భాగం మంగళవారం ఉదయం తొలుత నెల్లూరును తాకడంతో అక్కడ భారీవర్షాలు కురిశాయి. ఆ తరువాత ప్రకాశం, గుంటూరు జిల్లాలను తాకడంతో ఎక్కువ వర్షాలు కురిశాయి. కాగా తుఫాన్‌కు ఉత్తరాన ఉండే మేఘాల ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయని వాతావరణ అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. తీరం దాటే సమయంలో మాత్రం అటు తక్కువగా కురిశాయన్నారు. వాతావరణంలో మార్పుల మేరకు ఇలా జరిగిందని కచ్చితంగా చెప్పలేమన్నారు. తుఫాన్‌కు తూర్పుభాగం విచ్ఛిన్నం కావడం, పడమర భాగంలో నీటి మేఘాలు ఎక్కువగా ఉండడంతో నరసాపురం సమీపాన తుఫాన్ తీరాన్ని దాటిందని, తూర్పుభాగంలో విండ్ షీర్ ఎక్కువ లేకపోతే కాకినాడ వైపు వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు.