Crop Loss: పంట నష్టం.. రైతుకు కష్టం
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:05 AM
మొంథా తుఫాను అన్నదాతకు అపార నష్టం కలిగించింది. తుఫాను ప్రభావిత జిల్లాలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.
3 లక్షలకుపైగా ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
ఇందులో 70 శాతం వరే.. నీటమునిగిన చేలు
మొక్కజొన్న, పత్తి, ఉద్యాన పంటలకూ దెబ్బ
ఉమ్మడి తూర్పు, కృష్ణా జిల్లాల్లో భారీ నష్టం
ప్రభావిత జిల్లాల్లో అధికారుల పరిశీలన
కొన్ని ప్రాంతాల్లో గురువారమూ కుండపోత
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
మొంథా తుఫాను అన్నదాతకు అపార నష్టం కలిగించింది. తుఫాను ప్రభావిత జిల్లాలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో సుమారు 70 శాతం వరి పంటలు ఉన్నట్టు సమాచారం. కొన్ని చోట్ల పంట నేలకొరిగిపోయి నీటిలో నానడంతో వరికంకులన్నీ కుళ్లిపోయాయి. ఇక వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మినుము, పత్తి, కూరగాయలు, ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో భారీ నష్టం సంభవించింది. ముఖ్యంగా వరిపంటను తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. గురువారం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఆయా జిల్లాలలో పంట నష్టంపై పరిశీలన చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారు. గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి ‘తూర్పు’లో అపారనష్టం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరికొద్దిరోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరిపంటను తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. కాకినాడ జిల్లాలో 14 మండలాల్లోని 216 గ్రామాల్లో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్నిచోట్ల వరిపంట తీవ్రంగా దెబ్బతింది. పంట నేలకొరిగిపోయి నీటిలో నానడంతో ధాన్యం మొలకెత్తింది. వరికంకులన్నీ కుళ్లిపోయాయి. దీంతో పంట ఎందుకూ పనికిరాని పరిస్థితి. కాకినాడ జిల్లాలో గురువారం ప్రాథమిక అంచనాల మేరకు.. పంటనష్టం 50,700 ఎకరాల్లో జరగ్గా రూ.98 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. కోనసీమ జిల్లాలో 78 వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా.. రూ.148 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. తూర్పుగోదావరిలో 10 వేలకుపైగా ఎకరాల్లో నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. పెదపూడి మండలంలో 16 వేల ఎకరాల్లో వరిపంట తీవ్రంగా దెబ్బతింది. ఈ మండలంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నష్ట తీవ్రతను పరిశీలించి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. గురువారం ఉదయం పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి తదితర మండలాల్లో మూడు గంటలకుపైగా భారీవర్షం కురిసింది. కాకినాడ జిల్లాలో కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఏలేరు రిజర్వాయరుకు ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో వరద ముప్పు పొంచి ఉంది. అన్నవరంలో పంపా రిజర్వాయరుకు వరద పోటెత్తుతోంది.
‘పశ్చిమ’లో 33,630 ఎకరాల్లో వరి నష్టం
పశ్చిమ గోదావరి జిల్లాలో 33,630 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. ఈ-క్రా్‌పలో నమోదైన పేర్ల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు. కౌలు రైతుల పేరు ఉంటే ముంపు పొలాల్లో వారి పేర్లనే పరిహారం కోసం నమోదు చేస్తున్నారు. అరటి, ఇతర కూరగాయల పంటలు 750 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. విరిగిపడిన చెట్లను పూర్తిగా తొలగించారు. రెండు రోజులు పాటు జిల్లాలోని 117 పునరావాస కేంద్రాల్లో 23,307 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో ఆ కేంద్రాల్లో ఉన్న వారంతా ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు.
ఏలూరు జిల్లా ఏజెన్సీలో కుండపోత
గురువారం తెల్లవారుజామున ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కుండపోత వర్షం కురిసింది. కొండవాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. పోలవరం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, ముసునూరు మండలాల్లో కాలువలు, వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా పోలవరం మండలంలో 94.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి కృష్ణాలో భారీ నష్టం
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 63,354.2 హెక్టార్లలో తీవ్ర పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా మేరకు కృష్ణా జిల్లాలో వరి 45 వేల హెక్టార్లలో, మినుము 985 హెక్టార్లు, వేరుశనగ 288 హెక్టార్లు, పత్తి 48 హెక్టార్లలో.. మొత్తంగా 46,357 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పలు మండలాల్లో కూరగాయలు, తమలపాకు, అరటి తోటలు బలమైన గాలుల తాకిడికి నేలకొరిగాయి. జిల్లాలో 2,229 మంది రైతులకు చెందిన 1416.22 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరి 5622 హెక్టార్లలో, పత్తి 10,068.2 హెక్టార్లు, మొక్కజొన్న 699 హెక్టార్లు, రాగి, కంది, మినుము, పెసర, వేరుశనగ, చెరకు వంటి ఇతర పంటలు 608 హెక్టార్ల మేర పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 235 గ్రామాలపై తుఫాను ప్రభావం చూపించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,876 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
అనకాపల్లి జిల్లాలో...
తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం జిల్లాలో పెద్దగా వర్షం కురవకపోయినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు జలాశయాల్లోకి చేరుతుండడంతో అధికారులు గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. జిల్లా వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం వెన్ను కట్టే దశలో ఉన్న 1,381 హెక్టార్ల వరి పంట ముంపునకు గురైంది. శారదా నదికి గట్లు పడటంతో సుమారు 1,500 ఎకరాల్లో వరి పంట మునిగిపోయింది.
ప్రతి ఒక్కరికీ పరిహారం: బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల జిల్లాలో నష్టపోయిన పంటలను అధికారులు లెక్కిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, జేసీ కొల్లాబత్తుల కార్తీక్, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 36,948 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని.. రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అర్హులందరికీ పరిహారం అందించేలా సమగ్ర నివేదిక తయారు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 464 హెక్టార్ల పంటలను ఆయన పరిశీలించారు. తన బనగానపల్లె నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీటిలో మంత్రి ట్రాక్టర్ నడుపుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
పాడేరు ఘాట్‌లో విరిగిపడ్డ కొండచరియలు
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌లో వ్యూపాయింట్‌కు సమీపాన గురువారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసమైంది. 2గంటలు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కలెక్టర్ దినేశ్‌కుమార్.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆర్‌డీవోను ఆదేశించారు. ఉదయం 9 గంటలకు రాకపోకలకు అనువుగా రోడ్డును బాగు చేశారు. భారీ వాహనాల కారణంగా మళ్లీ కొంత ధ్వంసం కావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాకపోకలను నిలిపివేశారు. మరమ్మతులు చేశాక వాహనాల రాకపోకలు యథాతథంగా కొనసాగాయి.