Share News

Cyclone Dithwa: శ్రీలంకలో విధ్వంసం

ABN , Publish Date - Nov 30 , 2025 | 04:42 AM

దిత్వా తుఫాను శ్రీలంకలో విధ్వంసం సృష్టించి భారత్‌ వైపు దూసుకొస్తోంది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో శ్రీలంకలో ఇప్పటికే 153 మంది మరణించగా...

Cyclone Dithwa: శ్రీలంకలో విధ్వంసం

  • 153 మంది మృతి.. 191 మంది గల్లంతు

  • అనేక ఇళ్లు ధ్వంసం.. నిరాశ్రయులైన వేలమంది

  • శిబిరాలకు లక్ష మందికి పైగా తరలింపు

  • తీవ్ర తుఫాన్‌తో అత్యవసర పరిస్థితి ప్రకటన

  • 27 టన్నుల సహాయ సామగ్రి పంపిన భారత్‌

  • కొలంబోలో 300 మంది భారతీయులు

  • విమానాల రద్దుతో 3 రోజులుగా అక్కడే

  • తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

  • కేరళ, కర్ణాటక, తెలంగాణల్లోనూ భారీ వానలు

కొలంబో, నవంబరు 29: దిత్వా తుఫాను శ్రీలంకలో విధ్వంసం సృష్టించి భారత్‌ వైపు దూసుకొస్తోంది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో శ్రీలంకలో ఇప్పటికే 153 మంది మరణించగా, మరో 191 మంది గల్లంతయ్యారని కొలంబోలోని విపత్తుల నిర్వహణ కేంద్రం(డీఎంసీ) శనివారం ప్రకటించింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 25 జిల్లాల్లోని 2.17 లక్షల కుటుంబాలకు చెందిన 7.74 లక్షలమందికిపైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అనేక ఇళ్లు ధ్వంసమవడంతో లక్ష మందికిపైగా బాధితులను ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించామని డీఎంసీ డీజీ కె.సంపత్‌ విలేకరులకు తెలిపారు. సైనిక దళాల సాయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా, మటలే జిల్లాలో గురువారం అత్యధికంగా 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మటలే, పొలొన్నరువ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు, కీలక వంతెనలు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాలకు సాయం అందడం లేదు. వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు మిలిటరీ హెలికాప్టర్లు, బోట్లను వినియోగిస్తున్నారు. నదులు ఉప్పొంగడంతో వాటి ఒడ్డున నివసించేవారంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు.


వందలాదిమందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకె దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కాగా, దిత్వా శ్రీలంక నుంచి నిష్క్రమించి భారత్‌వైపు వెళ్తోందని శ్రీలంక వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ అతుల కరుణనాయకె తెలిపారు. శ్రీలంకను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సాగర్‌ బంధు చేపట్టింది. శుక్రవారం 6 టన్నుల సహాయ, పునరావాస సామగ్రిని శ్రీలంకకు పంపింది. శనివారం రెండు మిలిటరీ రవాణా విమాణాల్లో మరో 21 టన్నుల సామగ్రిని పంపింది. మరింత సాయం పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’లో తెలిపారు. మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇప్పటికే భారత విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు శ్రీలంకలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ, 80 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కూడిన రెండు సహాయక బృందాలను కూడా శ్రీలంక పంపినట్టు విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. ఇప్పటికే సముద్ర, వాయు మార్గాల్లో 27 టన్నుల సామగ్రిని శ్రీలంకకు అందించామని, మరింత సాయం అక్కడికి చేరుతోందని చెప్పారు. భారత్‌ బాటలోనే అమెరికా, మాల్దీవులు కూడా శ్రీలంకకు సాయం ప్రకటించాయి. తక్షణ సాయంగా శ్రీలంకకు రూ.17.86 కోట్లు(2 మిలియన్‌ డాలర్లు) కేటాయిస్తున్నామని అమెరికా తెలిపింది. శ్రీలంకకు రూ.44 లక్షలు(50 వేల డాలర్లు), 25 వేల కేసుల ట్యూనా క్యాన్లు పంపిస్తున్నామని మాల్దీవుల ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.


3 రోజులుగా భారత ప్రయాణికుల అవస్థలు..

దుబాయి నుంచి శ్రీలంక మీదుగా భారత్‌కు బయలుదేరిన సుమారు 300 మంది ప్రయాణికులు.. దిత్వా తుఫాను వల్ల విమానాలు రద్దవడంతో గత మూడు రోజులుగా కొలంబోలోని విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వారిలో 150 మంది తమిళనాడువాసులు ఉన్నారు. తమకు తగినంత ఆహారం, నీరు, ఇతర మౌలిక సదుపాయాలూ కల్పించలేదని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పందించారు. కొలంబోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో వారందరినీ సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కొలంబోలోని రాయబార కార్యాలయ అధికారులతో తమిళనాడు అధికారులు సంపద్రింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని భారత తాత్కాలిక రాయబారి డాక్టర్‌ సత్యాంజల్‌ పాండే.. కొలంబో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారతీయులను కలిశారు. వారిని వెంటనే స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోందని భరోసా కల్పించారు. విమానాశ్రయంలో అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. భారతీయులందరికీ ఆహారం, నీరు సహా సాయాన్ని అందిస్తున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 04:43 AM