Flood Warning: తీరం దాటిన వాయుగుండం
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:08 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తెల్లవారుజామున ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపాన తీరం దాటింది. అనంతరం పశ్చిమంగా పయనించి మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది.
1న మరో అల్పపీడనం..
కృష్ణా, గోదావరికి పెరిగిన వరద
మొదటి హెచ్చరిక జారీ.. ఏలూరు జిల్లాలో 23 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తెల్లవారుజామున ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపాన తీరం దాటింది. అనంతరం పశ్చిమంగా పయనించి మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు పయనించి ఆదివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. ఆ తర్వాత పశ్చిమంగా పయనించి గుజరాత్‌కు ఆనుకుని అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కోస్తా వెంబడి బలంగా గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. కాగా, ఈనెల 30వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. దాని ప్రభావంతో వచ్చే నెల ఒకటో తేదీన ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక(43 అడుగులు) దాటి 44.5 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 10.14 లక్షల క్యూసెక్కులు ఉందని, ఇది ఆదివారానికి 11-12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగం అందుబాటులో ఉండి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ఆదివారం ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అనూహ్యంగా పెరిగిన గోదావరి వరద
గోదావరిలో శనివారం నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 10,13,149 క్యూసెక్కుల వరద జలాలను 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే ఎగువన నీటిమట్టం 32.730 మీటర్లు, దిగువన 24.6100 మీటర్లు నమోదైంది. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా గొందూరు గండి పోశమ్మ ఆలయం, టూరిజం బోట్ పాయింట్లు నీటమునిగాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పలు రోడ్లు నీట మునడంతో 23 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మండలంలో 200 ఎకరాల్లో మిరప పంట నీటమునిగింది. కుక్కునూరు మండలంలో కుక్కునూరు-దాచారం దారిలో వరద ఉధృతంగా ఉంది.