సై..సై.. సైకిల్..!
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:25 PM
మానవాళికి సేవ చేసే వాహనం సైకిల్. సామాన్యుడికి అందుబాటులో ఉంటూ అతి సామాన్య ధరకు లభించే ఏకైక వెహికల్ సైకిల్. నేడు ప్రతి ఇంటిలో సైకిల్ దర్శనమిస్తుంది.
సామాన్యుడి ‘ఆరోగ్య వాహనం’
నేడు ప్రపంచ సైకిల్ డే
పాణ్యం, జూన 2 (ఆంధ్రజ్యోతి) :మానవాళికి సేవ చేసే వాహనం సైకిల్. సామాన్యుడికి అందుబాటులో ఉంటూ అతి సామాన్య ధరకు లభించే ఏకైక వెహికల్ సైకిల్. నేడు ప్రతి ఇంటిలో సైకిల్ దర్శనమిస్తుంది. పర్యావరణం, దీర్ఘాయువు,సరళమైన నమ్మదగిన, శుభ్రమైన పర్యావరణ అనుకూలమైన స్థిరమైన రవాణా సాధనం సైకిల్. నిజానికి 20 ఏళ్ల క్రితం వరకూ ఇళ్లలో సైకిల్ ఉంటే గొప్ప. అప్పట్లో బైక్‌లు, కార్లు తక్కువే. విద్యార్థులు, ఉద్యోగుల్లో చాలా మంది సైకిళ్లపైనే వెళ్లేవారు. రోడ్లపై సైకిళ్లతోనే ఒకరినొకరు పోటీ పడేవాళ్లు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజులు భలే మంచి రోజులు. కాలక్రమేనా సైకిళ్ల వినియోగం తగ్గింది. కాలుష్యం బాగా పెరిగిపోయింది. ప్రస్తుత రోజుల్లో సైకిల్ అంటే వ్యాయామం కోసం, బరువు తగ్గడం కోసమే చాలామంది వాడుతున్నారు. కానీ ఎన్ని రకాల వాహనాలు వచ్చినా సైకిల్ క్రేజ్ సైకిల్‌కే ఉంది. అంతటి గొప్ప సైకిల్‌కు ఓ గుర్తింపు ఉండాలనే ఉద్ధేశ్యంతో 2018లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన 3వతేదీని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది.
మానవ సేవలో సైకిల్: మానవ సేవలో సైకిల్‌కు ప్రత్యేకత ఉంది. మిలటరీ, పోలీసు, సమాచార సరఫరా, వ్యాయామం, క్రీడాకార వ్యవస్థలో సైకిల్‌కు ప్రత్యేకత ఉండడం గమనార్హం. నేడు ఎంతో మందికి సైకిల్ సేవలందిస్తోంది. పాలవ్యాపారులు, పేపర్‌బాయ్స్, క్రీడాకారులు, వ్యాయామ క్రీడలో, చిన్నపిల్లలకు, విద్యార్థులకు, వికలాంగులకు, వ్యాపారులతో పాటు ఎన్నో స్వచ్చంద సంస్థల్లో సైకిల్ కీలక సేవలందిస్తోంది. ఆరోగ్య రవాణా సాధనంగా పర్యావరణ సాదనంగా సైకిల్ ఉపయోగపడుతోంది. సైకిల్ తొక్కడం వల్ల తక్కుత శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తుంది. భారతదేశంలో 1938లో సైక్లింగ్ క్రీడ మొదలైంది. సైక్లింగ్ సమాఖ్య ఆఫ్ ఇండియా ఈ క్రీడను జాతీయ క్రీడగా ప్రభత్వం నిర్ణయించింది. మౌంటెన బైకింగ్ ప్రధానక్రీడగామారింది. గీత 15 సంవత్సరాలుగా హిమాచల్‌లో ఈ సైకిల్ క్రీడను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. ఈ క్రీడల్లో ఎంతో మంది ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. సిక్కిం ప్రభుత్వం పెద్ద మొత్తంలో సైకిల్ రేసు విజేతలకు బహుమతులు అందజేస్తుంది. ఆసియా, ఒలంపిక్ క్రీడల్లో సైక్లింగ్ క్రీడనుచేర్చింది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాదులో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసింది. త్వరలో ఏపీ ప్రభుత్వం అమరావతిలో సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.
ఎన్నికల గుర్తుగా సైకిల్: సైకిల్ బొమ్మను ఎన్నికల గుర్తుగా భారత దేశంలో ఎన్నికల సంఘం వాడుతోంది. ఆంధ్రప్రదేశలో తెలుగుదేశం, ఉత్తరప్రదేశలో సమాజ్‌వాది పార్టీలు సైకిల్‌ను తమ పార్టీ గుర్తులుగా ఎంచుకొన్నాయి.
జిల్లాలో ఏటా 15 వేల సైకిళ్ల అమ్మకాలు : నంద్యాల జిల్లాలో 30కు పైగా సైకిల్ స్టోర్‌లు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో ఏటా 12 వేల నుంచి 15 వేల వరకు సైకిళ్ల అమ్మలు జరుగుతున్నాయి. ఆదరణ వంటి ప్రభుత్వ పథకాలతో సైకిళ్ల వినియోగం పెరిగింది. టైర్ల అమ్మరాలు, పంచర్ షాపులు, రేడియం షాపులు, పెయింటింగ్స్, విడి భాగాల చిరు వ్యాపారులు, పేద కుటుంబాలు జీవనంసాగిస్తున్నాయి.
అమ్మకాలు పెరిగాయి
- కేదార్‌నాథ్, సుధాలక్ష్మి సైకిల్ మార్ట్, నంద్యాల
1996 జూన 6న 150 సైకిళ్లతో వ్యాపారం ప్రారంభించాం. రూ.4 వేల నుంచి రూ. 40 వేల విలువైన సైకిళ్లు ఉన్నాయి. అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తన ఫ్యాక్టరీ కార్మికులకు 600 మందికి సైకిళ్లు ఇచ్చి సైకిళ్లను ప్రోత్సహించారు. పదేళ్ల క్రితం వరకు మోటారు సైకిళ్ల వినియోగంతో సైకిళ్ల అమ్మకాలు తగ్గుతున్న దశలో పైకిళ్ల మార్పుతో మళ్లీ గణనీయంగా పెరిగాయి. ఎక్కువగా చిన్నపిల్లల పైకిళ్ల అమ్మకాలు పెరిగాయి. పెద్దల సైకిళ్లు తగ్గిపోయాయి. కొత్తగా బ్యాటరీ సైకిళ్లు మార్కెట్లోకి రావడంతో పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి
-సికిందర్‌బాష, భారత సైకిల్ ఏజెన్సీ, నంద్యాల
సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలను ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలి. సైకిల్ పోటీలు నిర్వహించి గ్రామీణ స్థాయినుంచి క్రీడాకారులను, విద్యార్థులను ప్రోత్సహించాలి. 40 యేళ్ల క్రితం మా తాత అహ్మద్ హుశేన సైకిల్ మెకానిక్‌గా ఉండేవారు. 1983లో 15 సైకిళ్లతో మా తండ్రి చాంద్‌బాష సైకిళ్ల వ్యాపారం ప్రారంభించారు. 2017లో షోరూం ప్రారంభించాము.
ఫ్యాన్సీ పైకిళ్లపై మొగ్గు
- పవనకుమార్, మహాలక్ష్మి సైకిల్ మార్ట్, నంద్యాల
యువత ఎక్కువగా ఫ్యాన్సీ సైకిళ్లపై మొగ్గుచూపుతున్నారు. పాత మోడల్ తక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. 1961లో మా తాత బొగ్గరపు పుల్లయ్యశెట్టి సైకిల్ వ్యాపారం ప్రారంభించారు. అనంతరం మా తండ్రి రిక్షా పుల్లయ్య వ్యాపారాన్ని విస్తృతం చేసి రిక్షాల అమ్మకాలు ప్రారంభించారు. మూడు తరాలుగా చేస్తున్న ఈ వ్యాపారంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.