సైబర్ కేటుగాళ్లు
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:10 AM
దేశ, విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా అందనంత ఎత్తులో ఉంటారు ఈ సైబర్ కేటుగాళ్లు.

కోట్లలో అకౌంట్లకు చిల్లులు పెడుతున్న సైబర్ నేరగాళ్లు
జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలు
ఉద్యోగులు, వైద్యులు, బడాబాబులు, విద్యావంతులే బాధితులు
పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రజల్లో అవగాహన లేమి
అప్రమత్తంగా ఉండకపోతే అంతే..
నంద్యాల క్రైం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా అందనంత ఎత్తులో ఉంటారు ఈ సైబర్ కేటుగాళ్లు. చివరకు పోలీసులు కూడా ఈ కేటుగాళ్లను పట్టుకోవాలంటే దేశ, విదేశాలకు వెళ్లలేక వ్యయప్రయాసలకు గురవుతూ కేసుల్లో పురోగతిని సాధించలేకపోతున్నారు. బాధితులు తమ అకౌంట్ల నుంచి సొమ్ము జారిపోయాక లబోదిబోమంటూ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అవి కేవలం ఎఫ్‌ఐఆర్‌లకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నగదు రికవరీలో ఆశించినస్థాయిలో పురోగతిలేదు. ఇదిలా ఉండగా కేటుగాళ్లు ముందుగా డబ్బున్న బడాబాబులపై కన్నేస్తారు. సెల్‌ఫోన్లతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తారు. సదరు వ్యక్తులకు ఫోన్లు చేస్తారు. లేకపోతే సంక్షిప్త సమాచారాలు పంపుతారు. లింక్‌లు పెడతారు. న్యూడ్‌కాల్స్ చేయించి వారి వీడియోలను తీసుకొని సోషల్‌మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తారు. వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ చేసి రూ.లక్షలు, కోట్లలో నగదును లూటీ చేస్తారు. ఇవీ సైబర్ నేరగాళ్ల చేష్టలు. నంద్యాల, కర్నూలు జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది సైబర్ మోసాగాళ్ల వలలో పడి నష్టపోయారు. సైబర్ క్రైంపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ అవన్నీ పెడచెవినపెట్టి డబ్బుకు ఆశపడి సైబర్ గాళ్ల ఉచ్చులో ప్రజలు ఇరుక్కుంటున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
నంద్యాల జిల్లాలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. 2023తో పోల్చుకుంటే 2024లో ఆ కేసుల సంఖ్య 90శాతం పెరిగింది. 2023లో 29 సైబర్ క్రైం సంఘటనలు జరగ్గా 2024లో 56 సైబర్ కేసులు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది మూడు నెలల కాలంలో కూడా సైబర్ నేరాల కేసులు జిల్లాలో నమోదవుతున్నాయి. రూ.కోట్లలో నగదు పోగొట్టుకున్నప్పటికీ వాటిలో 10శాతం కూడా రికవరీ కాలేదు. యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వైద్యులు, ఇంటివద్ద పనిచేసే ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల నుంచి సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో రూ.లక్షలు దోచేస్తున్నారు. నకిలీ వేలిముద్రలు, సెల్‌ఫోన నంబర్లు, ఓటీపీ, మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. సైబర్‌నేరాల కేసులు పెరిగిపోతుండటంతో వాటిపై పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ వాస్తవాలను గ్రహించకుండా విద్యావంతులు, ఉద్యోగులు డబ్బు ఆశకు గురై ఉన్న డబ్బును పోగొట్టుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా కేంద్రంలో సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని, సిబ్బందిని ఏర్పాటు చేశారు.
హనీ ట్రాప్‌తో రూ.6లక్షలు..
సైబర్ కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి అందమైన యువతులను అడ్డు పెట్టుకుంటున్నారు. స్వీట్ వాయిస్‌తో కాల్స్ చేసే యువతుల ద్వారా హనీట్రాప్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నంద్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఓ యువతి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. రిక్వెస్ట్‌ను స్వీకరించిన రియల్ ఎస్టేట్‌వ్యాపారికి ఆ యువతితో మెసెంజర్‌లో చాటింగ్ మొదలు పెట్టింది. ఫ్రెండ్షిప్ పేరుతో వ్యాపారితో చాటింగ్ చేయడం కొనసాగింది. తన వాట్సాప్ కాల్ చేసేందుకు వ్యాపారి నెంబర్‌ను సెండ్ చేయమని చెప్పింది. వ్యాపారి తన వాట్సాప్ నెంబర్‌ను సెండ్ చేయడంతో వాట్సాప్‌లో న్యూడ్ కాల్ ద్వారా మాట్లాడటం జరిగింది. న్యూడ్ కాల్‌లో మాట్లాడేటప్పుడు ఆ వ్యాపారికి సంబంధించిన వీడియోను రికార్డు చేసి తమకు డబ్బులు పంపాలని లేకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. సమాజంలో పరువు పోతుందని భావించిన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి దాదాపు రూ.6లక్షల వరకు సమర్పించుకున్నాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా చోటుచేసుకున్నాయి. పరువు కోసం పాకులాడే ఆ ఘనులు విషయం బయటకు పొక్కితే పలుచనైపోతామన్న భావనతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉన్నవారు ఎందరో.
రూ.3 లక్షలు ఇచ్చి.. రూ.2కోట్లు స్వాహా..!
నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఇరుక్కుని రూ.2కోట్లు పోగొట్టుకున్నాడు. డాక్టర్ నంబర్‌కు ఫోనచేసిన సైబర్ నేరగాళ్లు ఆనలైన యాప్ ద్వారా ఆటలు ఆడటం ద్వారా సులువుగా తక్కువ నగదుతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ముగ్గులోకిదించారు. లింక్ ద్వారా యాప్‌ను డౌనలోడ్ చేసుకొని ఆడటం ప్రారంభించాడు. ఓ ఆటలో విజయం సాధించాడంటూ రూ.3 లక్షలు డాక్టర్ అకౌంట్‌కు జమచేశారు. దీంతో నమ్మకం పెంచుకొన్న డాక్టర్ రెట్టించిన ఉత్సాహంతో ఆటను కొనసాగించాడు. ఒక్కసారిగా సైబర్ నేరస్తులు డాక్టర్ అకౌంట్‌లోని రూ.2కోట్లు నగదును మాయం చేశారు. మోసపోయానని తెలుసుకున్న ఆ డాక్టర్ టూ టౌన పోలీస్ స్టేషనకు చేరుకొని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రెండు వారాల కిత్రం సైబర్ క్రైంకు పాల్పడిన వారితో సత్సంబంధాలున్న మధ్యప్రదేశకు చెందిన ముగ్గురు యువకులను నంద్యాల సైబర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరికొన్ని ఘటనలు పరిశీలిస్తే...
ఫ నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రముఖ వైద్య నిపుణుడు సైబర్ క్రైం కేటుగాళ్ల వలలో చిక్కుకొని రూ.26లక్షలు సొమ్మును అప్పనంగా అప్పగించారు. ఢిల్లీ నుంచి ఉన్నత పోలీస్ అధికారుల మాదిరి నంద్యాలలో ఓ ప్రముఖ డాక్టర్‌కు కాల్ చేసి నీ నంబర్‌పై పలు కేసులు ఉన్నాయని బెదిరించి డిజిటల్ అరెస్ట్ చేశారు. ఆనలైన నుంచి రూ.26లక్షలు కాజేశారు. తేరుకున్న డాక్టర్ నంద్యాల టూ టౌన పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు.
ఫ అలాగే జిల్లా కేంద్రంలోని పేరుగాంచిన వైద్యుడు కూడా ఈ కేటుగాళ్ల ఉచ్చులో ఇరుక్కున్నప్పటికీ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నాడు. వైద్యుడి వాట్సాప్ నెంబర్‌కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేసి ఈ నెంబర్‌పై ఆర్థిక నేరాలు తదితర కేసులు నమోదయ్యాయని బెదిరించి డిజిటల్ అరెస్ట్ ద్వారా సొమ్మును లాగేసుకొనే ప్రయత్నం చేశారు. రూ.కోటికి పైగా నగదు పంపాలని బెదింపులకు పాల్పడ్డారు. వైద్యుడు తన వాహనంలో ఫోన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో సైబర్ క్రైం నేరస్తుడు పరిస్థితిని పసిగట్టి కాల్ కట్ చేయడంతో ఆ వైద్యుడు ఊపిరిపీల్చుకున్నాడు.
ఫ ఆనలైన షాపింగ్ ద్వారా ఓ మహిళ తాను ఆర్డర్ చేసిన వస్తువులకు సంబంధించి పేమెంట్ చేయగా ఆ వెబ్‌సైట్ నకిలీది కావడంతో ఆమెకు మరో వ్యక్తి ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు అడిగి రూ.50వేలు కాజేశాడు. మరో ఘటనలో ఓ వ్యక్తి ఎంటర్‌ప్రైజెస్ సేవలను ఆనలైనలో బుక్ చేసుకున్నాడు. అతడి క్రెడిట్‌కార్డు వివరాలు పంచుకున్న తర్వాత అతడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు.
నకిలీ వేలిముద్రలంటే
ఏఈపీఎస్ (ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం) విధానం ద్వారా కొన్ని బ్యాంకులు ఔట్‌లెట్ సేవలు తీసుకొచ్చాయి. వీటితో ఆధార్ నంబర్‌ను నమోదు చేసి వేలిముద్ర వేసి డబ్బులు తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ నిర్వహించే బ్యాంకులతో అనుసంధానమై కొంత కమీషన తీసుకొని నగదు అందిస్తుంటారు. నగదు తీసుకొనే సమయంలో వేలిముద్రలను కేటుగాళ్లు కాపీచేస్తూ వాటి ద్వారా నగదు లాగేస్తున్నారు. కేవలం ఈ ఔట్‌లెట్ల వద్దే కాకుండా ఆధార్‌ను ఉపయోగించే రవాణాశాఖ, రేషన డిపోలు, రిజిసే్ట్రషన్లు, మీ సేవ తదితర చోట్ల అందించే వివరాలను కాజేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలంటే యాప్‌లోకి వెళ్లి థంబ్ లాక్ వేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధానంగా నమోదవుతున్న కేసులు
ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్, మార్కెట్ ప్లేస్ వంటి ఆనలైన ఫ్లాట్‌ఫారములు, వస్తువులు అమ్మే పేరుతో, ఫేక్ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ఆనలైన షాపింగ్ మోసాలు అధికంగా జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డుల వివరాలు సేకరించి సైబర్ నేరస్తులు డబ్బులు కాజేస్తున్నారు. వీటితోపాటు ఫేక్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారాజరుగుతున్నాయి. బ్యాంక్ అధికారులు,టెలికం కంపెనీ ప్రతినిధులుగా నమ్మించి ఓటీపీలు, పిన నంబర్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. వీటితోపాటు లాటరీ తగిలిందని, బహుమతులు వచ్చాయని నమ్మించి డబ్బులు డిపాజిట్ చేయించడం, కేవైసీ అప్‌డేట్ చేయాలని లేకపోతే బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని నమ్మించడమో లేదా బెదిరించడమో లాంటివి జరుగుతున్నాయి. లోనయాప్‌ల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మించి అధిక వడ్డీలు వసూలు చేయడం, రెండింతల అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాలంటూ బెదిరిస్తూ ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ ్యమాల్లో పెడతామని బెదిరించడం తదితర వాటిద్వారా సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు, కోట్లలో నగదు దోచుకుంటున్నారు.
ఫిర్యాదు ఇలా చేయాలి
బాధితులు మోసపోయామని గ్రహించిన వెంటనే 1930 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలి. సిబ్బంది అడిగే వివరాలను పూర్తిగా తెలియజేయాలి. వారిచ్చే ఐడీతో సమీపంలోని పోలీస్ స్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన యాప్‌లోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈలోపు ఏటీఎం, బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలుపుదల చేయించాలి.
అప్రమత్తత అవసరం
ఫ ఆనలైన బ్యాంకింగ్, ఇతర యాప్‌లనువినియోగిస్తే త్రీ స్టెప్ వెరిఫికేషన తప్పనిసరిగా పెట్టుకోవాలి. సులువుగా కాకుండా ఇతరులు గుర్తుపట్టగలిగేలా కాకుండా పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి.
ఫ ఎవరికీ ఓటీపీలు, ఖాతాల వివరాలు చెప్పకూడదు.
ఫ అపరిచితవ్యక్తులు పంపే మెయిల్స్, సంక్షిప్త సమాచారాలు, లింక్‌లను ఓపెనచేయకూడదు.
ఫ ఉద్యోగులు, కొరియర్లు, ఇతర సేవల పేరుతో వచ్చే ఫోనకాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఫ అవసరం మేరకు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమైన వేలి ముద్రలను ఉపయోగించాలి.
ఫ ప్రైవేట్ ఇంటర్‌నెట్ సెంటర్లు, ఇతరుల సెల్‌ఫోన్లలో ఖాతాలను సరిచూసుకోవడం మానుకోవాలి.