Share News

DGP Harish Kumar Gupta: రాష్ట్రంలో పక్కాగా పోలీసింగ్‌

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:08 AM

రాష్ట్రంలో పటిష్ఠ పోలీసింగ్‌ కారణంగా ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయి. మహిళలపై హింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా తగ్గాయి....

DGP Harish Kumar Gupta: రాష్ట్రంలో పక్కాగా పోలీసింగ్‌

  • ప్రజలకు మరింత చేరువ: డీజీపీ

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో పటిష్ఠ పోలీసింగ్‌ కారణంగా ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయి. మహిళలపై హింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా తగ్గాయి.’’ అని డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు వచ్చే సంవత్సరంలో నూతన ప్రణాళికలు అమలు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుత సంవత్సరం(2025)లో రాష్ట్ర పోలీసుల పనితీరును మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఐజీలు సీహెచ్‌ శ్రీకాంత్‌, ఆకే రవికృష్ణ, పాలరాజుతో కలిసి సోమవారం ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాలు పెరిగాయని, వాటిని ఎలా కట్టడి చేయాలనే దానిపై జనవరిలో ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. సాంకేతికత సాయంతో నేరాలను కట్టడి చేశామని, గత ఏడాదితో పోల్చితే 6.17శాతం మేరకు నేరాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. గంజాయి సాగు నిర్మూలనలో విజయం సాధించామన్నారు. ‘మహిళల రక్షణ కోసం 164 శక్తి బృందాలను ఏర్పాటు చేశాం. బాధితుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిన పది నిమిషాల్లోనే రక్షించాం. దీంతో మహిళలపై గృహ హింస తగ్గింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గాయి. అయితే, సైబర్‌ నేరాలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. మేం స్పందించేలోపే సైబర్‌ నేరస్తులు కొట్టేసిన మొత్తాన్ని చైనాలోని క్రిప్టోలోకి మళ్లించేస్తున్నారు. దీంతో రికవరీ కష్టంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కొత్త సంవత్సరంలో ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఆర్థిక మోసాలను కూడా కట్టడి చేస్తాం. రాబోయే పదేళ్లలో పోలీసింగ్‌ ఎలా ఉంటుందనే దానిపై సంక్రాంతి తర్వాత రెండు రోజులు వర్క్‌షాప్‌ నిర్వహించి.. పోలీసింగ్‌లో మార్పులు చేయనున్నాం. సంక్లిష్టమైన కేసులు ఎలా చేధించారు.. పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతికత వినియోగం, ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంపై పోలీసు అధికారులకు వివరిస్తాం. రాష్ట్రంలో గతంలో సెల్‌ ఫోన్ల రికవరీ ఆశాజనకంగా ఉండేది కాదు. ఈ ఏడాది 35,116 ఫోన్లను రికవరీ చేశాం. సైబర్‌ ముఠాలను గుర్తించాం. అంతర్జాతీయ ముఠాలను సైతం కట్టడి చేస్తున్నాం’’ అని డీజీపీ వివరించారు.


పేకాటపై పీడీ యాక్టులు..

రాష్ట్రంలో ఎక్కడైనా పేకాట క్లబ్బులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు. అవసరాన్ని బట్టి పీడీ యాక్టు నమోదు చేస్తామని తెలిపారు. చట్టానికి అందరూ సమానమేనని, హద్దులు మీరితే ఉపేక్షించబోమన్నారు.

అల్లర్లకు అడ్డుకట్ట

రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన నేరాల్లో అత్యధికంగా అల్లర్లు 54 శాతం ఉన్నాయని డీజీపీ వెల్లడించారు. ఆర్థిక నేరాలు 4.78ు, సైబర్‌ మోసాలు 18.94ు, హత్యాయత్నాలు 11.6ు పెరిగినట్లు చెప్పారు. ప్రజల్లో భయం సృష్టించేందుకు ప్రయత్నించిన 154 మందిపై రౌడీ షీట్లు తెరిచామన్నారు. రాష్ట్రంలో నమోదైన 26,518 రౌడీ షీట్లు కొనసాగిస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్‌ ట్రేస్‌’ కింద 80 శాతం మంది బాలికలు, 47శాతం మంది మహిళలను గుర్తించామని తెలిపారు. 112 ఎమర్జెన్సీ సేవల స్పందన సమయాన్ని 30 నిముషాల నుంచి 16 నిముషాలకు తగ్గించామన్నారు.

డ్రగ్స్‌ లింకులు తెంపేస్తున్నాం: రవికృష్ణ

డ్రగ్స్‌ అమ్మకాలకు సంబంధించి బెంగళూరుతో పాటు కొన్ని రాష్ట్రాల్లోని లింకులను తెంపేస్తున్నామని ‘ఈగల్‌’ ఐజీ ఆకే రవికృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి సాగు అరికట్టినా సరఫరా జరుగుతోందని, ఏపీలో గంజాయి సరఫరాలో 12 రాష్ట్రాలకు చెందిన 343 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయా రాష్ట్రాల టాస్క్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకుని మూలాలను పెకిలించబోతున్నట్లు తెలిపారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌ నివేదికల్లో నాణ్యత, వేగం పెరిగిందని ఫలితంగా కేసుల పరిష్కారం, శిక్షలు పెరిగాయని వివరించారు.

ఏపీ కేడర్‌కు 8మంది ఐపీఎ్‌సలు..

ఏపీ కేడర్‌కు 8 మంది యువ ఐపీఎస్‌ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2023 బ్యాచ్‌కు చెందిన కాకుమాను అశ్విన్‌ మణిదీప్‌, జె. జశ్వంత్‌ చంద్ర, జీబీఎల్‌ అన్నపూర్ణ ప్రత్యూష, తరుణ్‌, జయశర్మ, జాధవ్‌ రావ్‌ నిరంజన్‌, బన్నా వెంకటేశ్‌, తరుణ్‌ ప్రతాప్‌ మౌర్యను రాష్ట్రానికి కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Dec 30 , 2025 | 05:08 AM