Share News

Digital Arrest Scam: డిజిటల్‌ అరెస్టు పేరిట మస్కా

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:47 AM

డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ బెదిరించి ఓ విశ్రాంత వైద్యుడి నుంచి కోటీ పది లక్షల రూపాయలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లను బాపట్ల జిల్లా పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు.

Digital Arrest Scam: డిజిటల్‌ అరెస్టు పేరిట మస్కా

విశ్రాంత వైద్యుడి నుంచి రూ.1.10 కోట్లు స్వాహా

కర్ణాటకలో ఇద్దరిని అరెస్టు చేసిన బాపట్ల పోలీసులు

బాపట్ల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ బెదిరించి ఓ విశ్రాంత వైద్యుడి నుంచి కోటీ పది లక్షల రూపాయలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లను బాపట్ల జిల్లా పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ ఆ వివరాలను శుక్రవారం విలేకరులకు తెలియజేశారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణానికి చెందిన ఓ విశ్రాంత వైద్యుడికి ఈ నెల 19న సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి.. డిజిటల్‌ అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే కొంత డబ్బు చెల్లించాలని బెదిరించి.. ఆయన వద్ద నుంచి రూ.1.10 కోట్లు కాజేశారు. తాను మోసపోయినట్టు గుర్తించిన ఆ వైద్యుడు.. చీరాల పట్టణ పోలీసులను ఆశ్రయించగా తక్షణమే స్పందించిన ఎస్పీ ఉమామహేశ్వర్‌ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సాంకేతిక సాయంతో సైబర్‌ నేరగాళ్లు కర్ణాటకలో ఉన్నట్టు గుర్తించిన ఈ బృందం.. అక్కడకు వెళ్లి ఇద్దరిని అరెస్టు చేసి తీసుకొచ్చింది. వారి వద్ద నుంచి రూ.2.5 లక్షలు, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)లో పరిశీలించగా వారిపై 8 రాష్ట్రాల్లో రూ.14 కోట్లకు సంబంధించిన సైబర్‌ నేరాలు నమోదైనట్లు గుర్తించారు. కాగా, ఈ కేసులో వారం రోజుల్లోనే ఇద్దరిని అరెస్టు చేయడం అభినందనీయమని ఎస్పీ అన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ అనగానే భయభ్రాంతులకు గురై మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

Updated Date - Sep 27 , 2025 | 04:47 AM