Testing Kits: పోలవరం క్షేత్రంలో టెస్టింగ్ కిట్లు పెంచండి
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:22 AM
పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణాలైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులకు వాడుతున్న మట్టి, రాళ్ల నాణ్యతపై సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్...
టెక్నీషియన్ల సంఖ్యను కూడా: సీఎస్ఎంఆర్‌ఎస్
ఈసీఆర్‌ఎఫ్ కోసం వాడుతున్న మట్టి, రాళ్ల నాణ్యత బాగుంది
ఇక తరచూ పర్యవేక్షిస్తాం: శాస్త్రవేత్తలు
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణాలైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులకు వాడుతున్న మట్టి, రాళ్ల నాణ్యతపై సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్‌ఎస్) సంతృప్తి వ్యక్తంచేసింది. కీలక దశలో ఉన్న ఈ నిర్మాణాలకు సంబంధించి మట్టి, రాళ్ల నాణ్యతా పరీక్షల మోతాదును పెంచాలని సూచించింది. నాణ్యతా ప్రమాణాలను పరీక్షించే ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్యను కూడా పెంచాలని తెలిపింది. ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న ఈ సంస్థ శాస్త్రవేత్తల బృందం ఆదివారం కూడా పరీక్షలు కొనసాగించింది. ఇప్పటికే 81శాతం మేర పూర్తయిన డయాఫ్రం వాల్ పనులపైన, దీనికోసం వాడుతున్న ప్లాస్టిక్-కాంక్టీట్ మిశ్రమం దృఢత్వంపైనా సంతృప్తి వ్యక్తంచేసింది. మిగిలిన 19శాతం పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే నాణ్యత కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఐదు టెస్టింగ్ యంత్రాలను రెట్టింపు చేయడానికి, ల్యాబ్ టెక్నీషియన్లను కూడా పెంచేందుకు అంగీకరించారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు కూడా చురుగ్గా ప్రణాళిక మేరకు జరుగుతున్నాయని.. 2027 జూన్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. గోదావరి పుష్కరాల సమయానికి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించగలమన్న ధీమా వ్యక్తంచేశారు.