AP CS Vijayanand: అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:31 AM
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఇంధన సంస్థలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.
విద్యుత్తు సంస్థలకు సీఎస్ విజయానంద్ ఆదేశం
అమరావతి ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఇంధన సంస్థలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుదాఘాతంతో మరణాలు సంభబించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ట్రాన్స్‌కో, జేఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీలను విజయయానంద్ ఆదేశించారు. మంగళవారం ఏపీట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, డైరెక్టర్ (గ్రిడ్) భాస్కర్, డిస్కమ్‌ల సీఎండీలు పృధ్వీతేజ్, సంతోష్ రావు, పుల్లారెడ్డితో విజయానంద్ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. భారీ వర్షాలతో విద్యుత్తు సంస్థలకు నష్టం వాటిల్లకుండా పటిష్ఠమంతమైన కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్తు అంతరాయం కలిగినప్పుడు తక్షణమే పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని పంపిణీ సంస్థలను ఆదేశించారు.
అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూడాలి: జయలక్ష్మి
కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూడాలని స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణా, గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎస్టీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిత్యావసర వస్తువులు, మందులు, శానిటేషన్ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తక్షణ ఖర్చులకు జిల్లాకు కోటి చొప్పున విడుదల
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయ కార్యకలాపాల కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసింది. విపత్తుల సమయంలో తక్షణ ఖర్చులు భరించడానికి టీఆర్ 27 కింద ఈ నిధులు తీసుకోవటానికి జిల్లా కలెక్టర్లను అనుమతించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఈ నిధులు కేటాయించారు. వరద ప్రాంతాల నుంచి బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం, తాగునీరు, ఆహారం, పాలు అందించడం, పారిశుధ్యం, ఆరోగ్య శిబిరాల నిర్వహణకు ఈ నిధుల వినియోగంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖర్చు చేయని నిధుల్ని నెల రోజుల్లోపు తిరిగి జమ చేయాలని పేర్కొంది.