కిరాతకంగా..
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:02 AM
పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని మద్యం తాగుదామని వైన్ షాపునకు రప్పించి, అతని తలపై సీసా పగులకొట్టి.. పగిలిన సీసాతో 19 సార్లు విచక్షణా రహితంగా పొడిచిన ఘటన పాయకాపురం ప్రకాష్‌నగర్‌లోని ఓ వైన్ షాపులో రెండు రోజుల క్రితం జరిగింది.
మద్యం సీసా తల పగులకొట్టి విచక్షణారహితంగా దాడి
రెండు రోజుల క్రితం ఓ వైన్ షాపు నాన్ పర్మిట్ రూమ్‌లో ఘటన
సాధారణ కేసుతో సరిపెట్టిన పోలీసులు
రక్తపు మడుగును కడిగేసిన వైన్ షాపు నిర్వాహకులు
చక్రం తిప్పిన చోటా నాయకుడు
పోలీసుల తీరుపై వ్యక్తమవుతున్న విమర్శలు
పాయకాపురం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని మద్యం తాగుదామని వైన్ షాపునకు రప్పించి, అతని తలపై సీసా పగులకొట్టి.. పగిలిన సీసాతో 19 సార్లు విచక్షణా రహితంగా పొడిచిన ఘటన పాయకాపురం ప్రకాష్‌నగర్‌లోని ఓ వైన్ షాపులో రెండు రోజుల క్రితం జరిగింది. స్థానిక పోలీసులు సాధారణ కొట్లాట కేసు పెట్టి చేతులు దులుపుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల కొట్లాట కేసుల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్న ఓ చోటా నేత ఈ కేసులో తలదూర్చి తీవ్రతను తగ్గించే విధంగా పోలీసులను ’’కవర్’’ చేసినట్లు తెలుస్తోంది.
వైన్ షాపు రక్తసిక్తం
పాయకాపురం సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన పోట్రు విఘ్నేశ్వరరావు(33) మున్సిపల్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. విఘ్నేశ్వరరావుకు అదే ప్రాంతానికి చెందిన చింతాడ నాగరాజుకు పాత గొడవలు ఉన్నాయి. పాయకాపురం కండ్రిక కాలనీకి చెందిన ఓ గల్లీ నేత అనుచరుడిగా ఉంటున్న నాగరాజు పాత గొడవ తాలూకు పగతీర్చుకునేందుకు సిద్ధమై కొందరి సహాయంతో విఘ్నేశ్వరరావును ప్రకాష్‌నగర్‌లోని ఓ వైన్ షాపునకు రప్పించాడు. పాత గొడవలు మరచిపోయిన విఘ్నేశ్వరరావు వైన్ షాపులో అనధికారిక పర్మిట్ రూమ్ ఉండటంతో అక్కడ మద్యం తాగేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన నాగరాజు విఘ్నేశ్వరరావుతో మాట కలిపి వాగ్వివాదానికి దిగాడు. టేబుల్ మీద ఉన్న మద్యం బాటిల్‌ను తీసుకుని తలపై బలంగా కొట్టాడు. తలపగిలి రక్తమోడుతున్నా వదలకుండా అప్పటికే చేతిలో పగిలి పదును తేరిన మద్యం సీసాతో విఘ్నేశ్వరరావును విచక్షణా రహితంగా పొడిచాడు. మొత్తం 19 సార్లు పొడిచిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ దాడిలో విఘ్నేశ్వరరావు తల, మొహం, మెడ, చేతులు, ఛాతీలపై అనేక చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 40 కుట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ దాడితో వైన్ షాపు ముందే నిస్సహాయ స్థితిలో పడి ఉన్న బాధితుడిని నున్న రూరల్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సాధారణ కొట్లాట కేసుగా సరిపెట్టేశారు. దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనధికారిక పర్మిట్ రూమ్ నడుపుతున్న వైన్ షాపు నిర్వాహకులు విఘ్నేశ్వరరావుపై దాడి అనంతరం రక్తపు మడుగు కడిగేసి తమకు ఏమి తెలియనట్లు యథావిధిగా వ్యాపారం నిర్వహించారు. వీరిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రకాష్‌నగర్ కేంద్రంగా గ్యాంగ్!
పాయకాపురం ప్రకాష్ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ గ్యాంగ్ హామీతోనే హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్న ఓ యువకుడు పాయకాపురం కండ్రిక కాలనీకి చెందిన ఓ గల్లీ నేత వద్ద ఉంటూ అతని పనులు చేసిపెట్టడమే కాకుండా, పనిలో పనిగా స్థానికంగా కొట్లాటలకు వెళ్లే యువకులను గ్యాంగ్‌గా తయారు చేసుకుని స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో ఈ గ్యాంగ్ పాయకాపురం కేంద్రంగా అనేక ఘర్షణల్లో కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. ఏదైనా గొడవ ఉంటే తమ వద్దకు రమ్మని పంచాయితీలు చేయడం, అవతలి వారు మాట వినకపోతే దాడులకు దిగడం ఈ గ్యాంగ్ పని. పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా గ్యాంగ్‌పై దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు.