Share News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:36 PM

శ్రీశైల క్షేత్రంలో భక్తుల సందడి అధికంగా ఉంది. శనివారం సాయంత్రం యాత్రికుల రాకతో క్షేత్ర పురవీధులన్నీ రద్దీగా కనిపించాయి.

శ్రీశైలంలో భక్తుల రద్దీ

-వేలాదిగా వస్తున్న యాత్రికులు

-వసతి గదుల కోసం సామాన్య భక్తుల ఇక్కట్లు

శ్రీశైలం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో భక్తుల సందడి అధికంగా ఉంది. శనివారం సాయంత్రం యాత్రికుల రాకతో క్షేత్ర పురవీధులన్నీ రద్దీగా కనిపించాయి. రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు అప్రమత్తమై దర్శన ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు. కంపార్టుమెంట్లలో వేచిఉండే భక్తులకు స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలు కల్పించారు. ఉభయ దేవాలయాల్లో సుమారు మూడు గంటల సమయం పడుతోందని, భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. శని, ఆది, సోమ వారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా సామూహిక, గర్బాలయ అభిషేకాలు, శ్రీచక్ర కుంకుమార్చనలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. రుద్రహోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమాలకు ముందస్తుగా ఆనలైనలో బుకింగ్‌ చేసుకున్నవారు ఆయా టైంస్లాట్‌లలో మాత్రమే ఆలయ ప్రవేశం చేయాలని కోరారు.

వసతి గదుల ఇక్కట్లు:

వారాంతపు సెలవులు కావడంతో యాత్రికులు వేలసంఖ్యలో శ్రీశైలానికి వచ్చారు. దీంతో సరైన వసతి సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. దేవస్థానం సామాన్య భక్తుల కోసం ఉచిత శౌచాలయాలు, డార్మిటరీ సౌకర్యాలను కల్పించాలని భక్తులు డిమాండ్‌ చేశారు. దేవస్థానం నిర్వహించే వసతి గదులతోపాటు నిత్యాన్నదాన సత్రాల్లో అద్దె గదులు పొందడానికి వేల రూపాయలు వెచ్చించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి తరహాలో కనీస ధరలకు మాత్రమే సామాన్య భక్తులకు గదులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 13 , 2025 | 11:36 PM