Share News

పంటల బీమా.. రైతుకు ధీమా!

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:39 AM

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన రైతుల్లో ధీమాను పెంచింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ తేదీలను నిర్ణయించింది. పసుపు పంటకు ఈ నెల 31, వరికి ఆగస్టు 15వ తేదీలోపు పంట బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వరి పంటకు గ్రామం యూనిట్‌గా, పసుపు పంటకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని పంటల బీమాను అమలు చేయనున్నారు. సొంత భూమి కలిగిన రైతులు, సాగుదారుల హక్కు కార్డులు(సీసీఆర్‌సీ) పొందిన కౌలురైతులు ఈ పథకం ద్వారా పంట బీమా ప్రీమియం చెల్లించవచ్చు.

పంటల బీమా.. రైతుకు ధీమా!

- రైతులకు వరంగా ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన

- పసుపు పంటకు ఈ నెల 31, వరికి ఆగస్టు 15లోపు ప్రీమియం చెల్లించాలి

- వరికి ఎకరానికి రైతు చె ల్లించాల్సిన ప్రీమియం రూ.830

- పంట బీమాగా వచ్చేది రూ.41,500

- పసుపునకు ఎకరానికి ప్రీమియం రూ.1,100

- పంట బీమాగా వచ్చేది రూ.1.10 లక్షలు

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన రైతుల్లో ధీమాను పెంచింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ తేదీలను నిర్ణయించింది. పసుపు పంటకు ఈ నెల 31, వరికి ఆగస్టు 15వ తేదీలోపు పంట బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వరి పంటకు గ్రామం యూనిట్‌గా, పసుపు పంటకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని పంటల బీమాను అమలు చేయనున్నారు. సొంత భూమి కలిగిన రైతులు, సాగుదారుల హక్కు కార్డులు(సీసీఆర్‌సీ) పొందిన కౌలురైతులు ఈ పథకం ద్వారా పంట బీమా ప్రీమియం చెల్లించవచ్చు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో ఏటా 1.62 లక్షల హెక్టార్లలో వరి, 2,500 హెక్టార్లలో పసుపు పంట సాగు చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కింద వరి, పసుపు పంటలకు పంటల బీమా వర్తిస్తుంది. ఈ రెండు రకాల పంటలు సాగు చేసిన రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే పంట రుణంతో పాటు, పంట బీమా ప్రీమియం నగదును అదనంగా మంజూరు చేస్తారు. బ్యాంకుల ద్వారానే పంట బీమా ప్రీమియం చెల్లిస్తారు. బ్యాంకుల్లో పంట రుణం తీసుకోని రైతులు పంట బీమాను చెల్లించవచ్చు. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌, బ్యాంకుల్లో పంట బీమాప్రీమియం జాతీయ పంట బీమా పోర్టల్‌ ద్వారా చెల్లించి తమపేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. పంట రుణాలు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాల్లో, తపాలా కార్యాలయాల్లో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్సీ) ద్వారా పంట బీమా ప్రీమియం చెల్లించే వెసులుబాటును కల్పించారు.

ప్రీమియంగా చెల్లింపులు ఇలా..

వరి పంటకు బీమా ప్రీమియంగా ఎకరానికి రైతులు తమ వాటాగా రూ.830 చెల్లించాలి. ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి సంభవించి రైతులు పంటలు కోల్పోయిన సమయంలో వరి పంటకు పంట బీమాగా ఎకరానికి రూ.41,500 చెల్లిస్తారు. పసుపు పంటకు రైతులు తమ వాటాగా బీమా ప్రీమియం కింద రూ.1,100 చెల్లించాలి. వివిధ కారణాలతో పసుపు పంట దెబ్బతింటే ఎకరానికి రూ.1.10 లక్షలను పంట బీమాగా చెల్లిస్తారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులు పంట వివరాల్లో మార్పులు చేయాల్సి వస్తే, బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే రెండు రోజుల ముందు వివరాలు తెలియజేయాల్సి ఉంది. పంట బీమా వద్దనుకుంటే ఏడు రోజుల ముందుగానే సంబంధిత సమాచారాన్ని తెలియజేయాలి.

ఈ-క్రాప్‌ నమోదు తప్పనిసరి

పంట బీమాకు ప్రీమియం చెల్లించాలంటే రైతులు సాగు చేసిన పంట వివరాలు ఈ-క్రాప్‌లో తప్పనిసరిగా నమోదుకావాలి. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వ్యవసాయశాఖ అసిస్టెంట్‌లు క్షేత్రస్థాయికి వెళ్లి సంబంధిత భూముల సర్వే నెంబర్లు, రైతుల పాస్‌బుక్‌లు, మనుగడలో ఉన్న బ్యాంకు ఖాతాల నెంబర్లు, ఆధార్‌ కార్డు నెంబర్లు, రైతుల ఫొటోలతో ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నమూనాలో వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఆ తర్వాత సంబంధిత రైతులు నిర్దేశించిన గడువులోగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఉంటేనే పంట బీమా వర్తిస్తుంది. ఏ వివరాలు సక్రమంగా నమోదు కాకున్నా పంట బీమా మంజూరుకు అవకాశం ఉండదు. పంట రుణాలు తీసుకోని రైతులు ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేయించుకుని, గ్రామస్థాయిలో వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ల ద్వారా సాగు చేసిన పంటల వివరాలకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలు తీసుకుని సీఎస్సీ ద్వారా పంట బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. పంటల బీమా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు వ్యవసాయశాఖ అధికారులకు రైతులు సహకరించాలని జిల్లా వ్యవసాయశాఖ జేడీ వైవీఎస్‌ మనోహరరావు ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - Jul 04 , 2025 | 12:39 AM