DGP Harish Kumar Gupta: నేరాలు 5.5 శాతం తగ్గాయ్..
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:33 AM
రాష్ట్రంలో నేరాలు 5.5 శాతం తగ్గినట్లు పోలీసుశాఖ స్పష్టం చేసింది. 2023 డిసెంబరు-2024 నవంబరు వరకు 1,10,111 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. 2024 డిసెంబరు- 2025 నవంబరు మధ్య 1,04,095 కేసులు రిజిస్టర్ అయినట్లు...
గత ఏడాది కాలంలో తగ్గిన కేసుల సంఖ్య
మహిళలపై నేరాలు, అట్రాసిటీ కేసులు కూడా..
16 జిల్లాల్లో కేసులు కిందకి.. 10 జిల్లాల్లో పైకి
కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో డీజీపీ వెల్లడి
రాష్ట్రంలో నేరాలు 5.5 శాతం తగ్గినట్లు పోలీసుశాఖ స్పష్టం చేసింది. 2023 డిసెంబరు-2024 నవంబరు వరకు 1,10,111 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. 2024 డిసెంబరు- 2025 నవంబరు మధ్య 1,04,095 కేసులు రిజిస్టర్ అయినట్లు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వెల్లడించారు. మహిళలపై నేరాలు 4 శాతం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 22.35 శాతం, నార్కొటిక్ కేసులు సుమారు 2శాతం, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా కేసులు 21.57 శాతం తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. నేరాలు తగ్గిన జిల్లాల్లో శ్రీకాకుళం మొదటి స్థానం (తగ్గుదల 37.5శాతం)లో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా (22.1శాతం), అనకాపల్లి (18.7శాతం), అల్లూరి (17.9శాతం), ప్రకాశం, నంద్యాల(16.3శాతం చొప్పున) ఉన్నాయి. నేరాలు పెరిగిన జిల్లాల్లో అన్నమయ్య అగ్రస్థానం (9.5శాతం)లో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కోనసీమ(8.5శాతం), నెల్లూరు (7.8శాతం), గుంటూరు (6.5శాతం), తిరుపతి (6.5శాతం) ఉన్నాయి.
మహిళలపై హత్యాచారం కేసులు 66.7 శాతం, హత్య కేసులు 36.8 శాతం తగ్గాయి. కృష్ణా, అనకాపల్లి, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో మహిళలపై నేరాలు తగ్గగా.. సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, గుంటూరు జిల్లాల్లో పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు గతేడాది 2,608 నమోదు కాగా ఈ ఏడాది 2,025 రిజిస్టర్ అయ్యాయి.
డ్రగ్స్, గంజాయి కేసులు శ్రీకాకుళం జిల్లాలో 213.6 శాతం పెరగ్గా, నెల్లూరు (121.4శాతం), కోనసీమ(72.7శాతం), ఏలూరు, కర్నూలు జిల్లాల్లో 50 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. పరస్పర దాడుల కేసుల్లో కడప జిల్లా(11.6శాతం) అగ్రస్థానంలో ఉండగా, నెల్లూరు (3.5శాతం), శ్రీసత్యసాయి (3.4శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కడపలో ఆస్తి తగాదాల కేసులు అత్యధికంగా 44 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో అల్లూరి, అన్నమయ్య, గుంటూరు, మన్యం ఉన్నాయి.
పోక్సో కేసుల్లో ఆరుగురికి మరణశిక్ష, 106 మందికి యావజ్జీవ శిక్షతో సహా మొత్తంగా 418 మందికి శిక్షలు పడ్డాయని, అందులో 14మంది మైనర్లు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. విద్యాసంస్థల్లో 13.43 లక్షల మందికి స్వీయ రక్షణ నైపుణ్యంపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికల్లో నాణ్యతతోపాటు వేగం పెరిగిందన్నారు.