Share News

AP Govt: నేరగాళ్ల భరతం పట్టే క్రైమ్‌ స్పాట్స్‌

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:11 AM

నేరం చేస్తే జైలుకు వెళ్లాల్సిందే. శిక్షల శాతం పెరిగి తీరాల్సిందే. అప్పుడే ప్రజల ధన, మాన, ప్రాణాలకు భరోసా ఉంటుంది. ఆధారాలు లేవంటూ కోర్టుల్లో కేసులు కొట్టేస్తే నిందితులకు భయం ఉండదు.

AP Govt: నేరగాళ్ల భరతం పట్టే క్రైమ్‌ స్పాట్స్‌

  • ఆధారాల సేకరణకు ప్రత్యేక వాహనాలు

  • అధునాతన కిట్‌, ఫోరెన్సిక్‌ నిపుణులతో ప్రత్యేక కార్లు

  • శిక్షల శాతం పెంచేలా పోలీసుల కసరత్తు

  • సీఎం చేతుల మీదుగా 109 వాహనాల పంపిణీకి సిద్ధం

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘‘నేరం చేస్తే జైలుకు వెళ్లాల్సిందే. శిక్షల శాతం పెరిగి తీరాల్సిందే. అప్పుడే ప్రజల ధన, మాన, ప్రాణాలకు భరోసా ఉంటుంది. ఆధారాలు లేవంటూ కోర్టుల్లో కేసులు కొట్టేస్తే నిందితులకు భయం ఉండదు. మళ్లీ నేరాలకు పాల్పడితే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. దీనికి ఎలాగైనా చెక్‌ పెట్టాలి. ఆధారాల సేకరణ నుంచి ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా వ్యవహరించి 65శాతానికి పైగా శిక్షలు పడేలా చేయాలి’’ ఇదీ ఏపీ పోలీసు శాఖ తీసుకున్ననిర్ణయం. దీంతో నేరాలు చేసే వారికి గట్టి హెచ్చరిక, బాధితులకు స్వాంత్వన లభించనుంది. ఇందుకోసం ప్రతి పోలీసు సబ్‌ డివిజన్‌కూ ప్రత్యేక ‘క్రైమ్‌ స్పాట్స్‌’ వాహనం రాబోతుంది. రాష్ట్రంలో ఏటా లక్ష దాకా కేసులు నమోదవుతుండగా అందులో ఏడేళ్లకు పైగా శిక్షలు పడే అవకాశమున్న నేరాల సంఖ్య తక్కువే. అయితే వాటిలో ఎక్కువగా కోర్టుల్లో వీగిపోతున్నందున నేరాల కట్టడి పోలీసులకు సవాలుగా మారుతోంది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌ నుంచి చార్జిషీట్‌ వరకూ దర్యాప్తు అధికారి చేస్తున్న పొరపాటు, లోపాలు, అవగాహన రాహిత్యాన్ని సరిచేసేందుకు ఏపీ పోలీసు శాఖ నడుం భిగించింది. పోలీసులకు సవాలు విసురుతోన్న సైబర్‌ నేరాలతో పాటు హత్యలు, అత్యాచారాలు, ఇతర తీవ్రమైన నేరాల్లో పక్కాగా ఆధారాలు సేకరించి నేరం చేసిన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడేలా చేయాలని గట్టి సంకల్పంతో ఉంది. రాష్ట్రంలోని 26 పోలీసు జిల్లాల్లో 109 పోలీసు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ప్రతి సబ్‌ డివిజన్‌కూ ఒక వాహనాన్ని ‘క్రైమ్‌ స్పాట్స్‌’ కేటాయించారు.


అధునాతన సాంకేతికత ఆ కారులోనే..!

ఈ వాహనంలో వెనుక సీటు తొలగించి అక్కడ అత్యంత అధునాతన ఫోరెన్సిక్‌ కిట్‌ ఏర్పాటు చేశారు. కెమికల్‌, నార్కో, బయాలజీ, సిరాలజీ, ఎక్స్‌ప్లోజివ్‌, గన్‌ రెసిడ్యూ,సైబర్‌ తదితర కిట్లు అందులో ఉంచారు.మరోవైపు కంప్యూటర్‌, ప్రింటర్‌, కెమెరాలు, మైక్రో స్కోప్‌లు,ఆడియో రికార్డ్‌,టార్చ్‌లైట్‌తోపాటు డ్రోన్‌ కూడా ఉంటుంది.ఎక్కడ నేరం జరిగినా సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం అందిన వెంటనే క్రైమ్‌ స్పాట్‌ను అప్రమత్తం చేస్తారు.పోలీసు అధికారి ఘటనా స్థలానికి చేరుకునేలోపు ఎఫ్‌ఎ్‌సఎల్‌ బృందం గూగుల్‌ మ్యాప్‌ సాయంతో సమాంతరంగా అక్కడికి చేరుతుంది. ఎక్కడైనా పొదల్లో, అటవీ ప్రాంతంలో దారి లేకపోతే డ్రోన్‌ గాల్లోకి ఎగిరి మార్గంతో పాటు స్పాట్‌ కూడా నైట్‌ విజన్‌ కెమెరాతో చూపిస్తుంది. అక్కడికి చేరుకున్న వెంటనే జరిగిన నేరాన్ని బట్టి ఎఫ్‌ఎ్‌సఎల్‌ బృందం ఆధారాలు సేకరిస్తుంది. హత్య జరిగితే రక్త నమూనా, సెమన్‌ నుంచి డీఎన్‌ఐ వరకూ ప్రతిదీ ఎఫ్‌ఎ్‌సఎల్‌ నిపుణులు సైంటిఫిక్‌గా పాడవ్వకుండా సేకరిస్తారు. పోస్టుమార్టం విస్రా 76 గంటల్లోపు పంపలేకపోతే ఫంగస్‌ చేరకుండా కెమికల్‌ నింపుతారు.సేకరించిన ఆధారాలు ఏవి ఎలా భద్రపరిచి పపాలో అలాంటి జాగ్రత్తలు తీసుకుని ల్యాబ్‌కు పంపుతారు.ఆప్రక్రియ జరిగినంతసేపూ స్థానిక డీఎ స్పీ, జిల్లా ఎస్పీ, డీజీపీ ఆపీస్‌, ఎఫ్‌ఎస్ఎల్‌ డైరెక్టర్‌ లైవ్‌చూసేలా వీడియో రికార్డు అవుతూ ఉంటుంది.


సీఎం చంద్రబాబు సూచనతోనే

శాంతి భద్రతల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కీలక సూచనతో ప్రతి సబ్‌ డివిజన్‌కూ ఒక ఎఫ్‌ఎస్ఎల్‌ బృందాన్ని వాహనం, కిట్‌తో పాటు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. శిక్షల శాతం బాగా తక్కువగా ఉందని, నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఆధారాలు ధ్వంసం చేస్తున్నారంటూ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఉదహరించారని అన్నారు. ముఖ్యమంత్రి సమయం అడిగి ఆయన చేతుల మీదుగా త్వరలో సబ్‌ డివిజన్లకు కార్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రతి వాహనంలోనూ ముగ్గురు చొప్పున నిపుణులు ఉంటారని, ఎప్పటికప్పుడు నేరాల తీరుతెన్నులపై సిబ్బందికి శిక్షణ ఇస్తుంటామని డీజీపీ తెలిపారు.

Updated Date - Jul 15 , 2025 | 04:13 AM