CM Chandrababu: సంపద సృష్టించి.. సమాజానికి సేవలందించండి
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:15 AM
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు సూచించారు. దేశీయ ఉత్పత్తులను...
మన ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ తీసుకురండి
యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు సూచించారు. దేశీయ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్’కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, పర్యాటకం, రక్షణ, అంతరిక్ష, ఎలకా్ట్రనిక్స్, లాజిస్టిక్స్.. ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను తయారు చేసేందుకు మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తీసుకురావాలని, ‘ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు’ అనే పేరు నిలబెట్టాలని కోరారు.