Vigilance Raids: ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:56 AM
రాష్ట్రంలో ఎరువుల అక్రమ విక్రయాలపై విజిలెన్స్ బృందాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎక్కడా అక్రమ విక్రయాలు జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా...
విజిలెన్స్ తనిఖీల్లో భారీగా బయటపడ్డ నిల్వలు
2,845 టన్నులు స్వాధీనం.. 199 కేసులు నమోదు
ఎవర్నీ ఉపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
కాకినాడ పోర్టుకు 40 వేల టన్నుల యూరియా
ఇండోనేషియా నుంచి భారీ నౌకలో రాక
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎరువుల అక్రమ విక్రయాలపై విజిలెన్స్ బృందాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎక్కడా అక్రమ విక్రయాలు జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నాయి. తాజాగా విజిలెన్స్ సోదాల్లో భారీగా ఎరువుల అక్రమ నిల్వలు, విక్రయాలు బయటపడ్డాయి. ఆగస్టు 23-31 మధ్య 286 విజిలెన్స్ బృందాలు 598 ఎరువుల దుకాణాల్లో సోదాలు చేశాయి. ఈ సందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న రూ. 1.83 కోట్ల విలువైన 934.19 మెట్రిక్ టన్నుల నిల్వల్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. నిత్యావసర వస్తువుల చట్టంలోని సెక్షన్ 6ఏ కింద 67 కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 4.29 కోట్ల విలువైన 1,911 టన్నుల ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీనికి సంబంధించి 124 కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన మరో 8 దుకాణాల యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టారు. మొత్తం 2,845 టన్నుల ఎరువుల్ని స్వాధీనం చేసుకుని, 199 కేసులు నమోదు చేశారు. ఎరువుల విక్రయాలపై సోమవారం రాత్రి ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైతుల్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించే ఎరువుల దుకాణాదారులు, డీలర్లను ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. అన్నదాతలకు ఎక్కడైనా ఎరువులు, పురుగు మందుల కొరత రానీయొద్దని నిర్ధేశించారు.