Excise Department: ఎవ్వరినీ వదలొద్దు
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:18 AM
అనధికార, నకిలీ మద్యం తయారీ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీని వెనుక ఎవరున్నా.. ఎంతటి వ్యక్తులైనా వదలొద్దని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించింది.
నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ ఆదేశాలు
నిందితుల కోసం కొనసాగుతున్న వేట
కమిషనరేట్‌కు ఎక్సైజ్ సీఐ హిమబిందు బదిలీ
మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నో
రాయచోటి/తెనాలి/ములకలచెరువు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అనధికార, నకిలీ మద్యం తయారీ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీని వెనుక ఎవరున్నా.. ఎంతటి వ్యక్తులైనా వదలొద్దని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆ శాఖ పలువురు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌రావు నేడో రేపో పోలీసులకు లొంగిపోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఇతడు త్వరలో భారత్‌కు వచ్చి.. వెంటనే పోలీసులకు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. సస్పెండైన తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డికి జనార్దన్‌రావు సన్నిహితుడన్న విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో ఓ డాబాను లీజుకు తీసుకుని.. మద్యం కంపెనీల పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసి తంబళ్లపల్లె, మదనపల్లెతో పాటు పలు మండలాల్లోని బెల్ట్‌షాపులకు సరఫరా చేశారు. ఈ నెల 3న ఈ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. వేల బాటిళ్ల మద్యం, బాటిళ్లు, స్పిరిట్, లేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు. 14 మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఏ-1గా జనార్దన్‌రావు ఉండగా.. జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్, పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన సీనియర్ టీడీపీ నేత సురేంద్రనాయుడు తదితరులు కూడా ఉన్నారు. వీరిలో 10 మందిని ఇప్పటికే అరెస్టుచేశారు. మిగిలిన వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, జనార్దన్‌రావు విదేశాల్లో ఉన్నారు. జయచంద్రారెడ్డిని, సురేంద్రనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో సోమవారం జనార్దన్‌రావు వీడియో విడుదల చేశారు.

ఈ స్కాంలో తంబళ్లపల్లె టీడీసీ నాయకులకు ఎటువంటి సంబంధమూ లేదని, అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉన్నానని తెలిపారు. అటు జయచంద్రారెడ్డి కూడా.. తాను ఏ తప్పూ చేయలేదని, కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తానని మంగళవారం సాయంత్రం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందురెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడలోని కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తూ.. మద్యం దుకాణాలు, బెల్ట్‌షాపులకు తరలిస్తున్నా పట్టించుకోకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమెకుముందు సీఐగా పనిచేసిన మాధవి పాత్రపైనా ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసులపైనా చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ అదుపులో కొడాలి
నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-12గా ఉన్న కొడాలి శ్రీనివాసరావు ఎట్టకేలకు ఎక్సైజ్-ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఇతడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైసీపీ నాయకుడు కావడం, అరెస్టు చేస్తే స్కాం వెనకున్న ఆ పార్టీ పెద్దలు, ముఖ్యమైన నిందితుల గుట్టు రట్టుచేయొచ్చన్న ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి గత మూడ్రోజులుగా విస్తృతంగా గాలింపు చేపట్టారు. వారి ప్రయత్నాలు ఫలించి మంగళవారం శ్రీనివాసరావు చిక్కినట్లు తెలిసింది.
చిన్ననాటి మిత్రులు కలసి..
జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు చిన్ననాటి మిత్రులు కాగా.. కొడాలి శ్రీనివాసరావు జనార్దన్‌రావుకు మిత్రుడు. ఈ ఏడాది ఏప్రిల్లో ముగ్గురం తంబళ్లపల్లెలో కలుసుకున్నామని.. పాత డాబాను తన పేరుపై అద్దెకు తీసుకుంటున్నట్లు వారు చెప్పడం వరకు తెలుసని, మిగిలిన వాటితో తనకు సంబంధం లేదని శ్రీనివాసరావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. అతడిని ములకలచెరువు ఎక్సైజ్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
ఉపేక్షించం: మంత్రి కొల్లు
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నాయకులను సస్పెండ్ చేశామని, ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించేది లేదని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడు జనార్దన్‌రావు దక్షిణాఫ్రికాలో ఉన్నాడని.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సన్నిహితులైన నాయకులు దక్షిణాఫ్రికా నుంచి వ్యాపార లావాదేవీలు నడుపుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యంలో అనేక అక్రమాలు జరిగాయని, ఒక్క వైసీపీ నాయకుడిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పటి రాకెట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇప్పుడు ఛేదిస్తున్నారన్నారు.