Share News

డేటా సెంటర్‌ వివరాలు వెల్లడించాలి: రాఘవులు

ABN , Publish Date - Nov 25 , 2025 | 06:12 AM

విశాఖపట్నం సమీపంలోని తర్లువాడలో పెడుతున్న గూగల్‌ డేటా సెంటర్‌ వివరాలను బయట పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డేటా సెంటర్‌ వివరాలు వెల్లడించాలి: రాఘవులు

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం సమీపంలోని తర్లువాడలో పెడుతున్న గూగల్‌ డేటా సెంటర్‌ వివరాలను బయట పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ డేటా సెంటరుకు భారీ స్థాయిలో విద్యుత్తు, నీరు అవసరం. వాటిని ఎక్కడ నుంచి తీసుకొస్తారో చెప్పాలి. రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటరు కోసం 49 మంది దళిత రైతుల నుంచి 100 ఎకరాల డి.ఫారం పట్టా భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా భూమిని ఎందుకు ఇవ్వరు? దీనిపై సామాజిక పర్యావరణ అధ్యయన నివేదికను కూడా బయటపెట్టలేదు. అసలు పర్యావరణ ప్రభావం అంచనా వేశారా? లేదా? చెప్పాలి. డేటా సెంటరు వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కానీ స్థానికులకు ఉపాధి కల్పించడం లేదు. సీఎం ప్రకటించిన సంజీవని పథకానికి సంబంధించిన విషయాలను కూడా ప్రభుత్వం దాస్తోంది. సంజీవని ద్వారా ఆరోగ్య సేవలంటే వాటిని ప్రైవేటుపరం చేయడమే. నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయడం అప్రజాస్వామికం. కార్మికుల హక్కులను కాలరాచే ఈ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈనెల 26న కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుంది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో గిరిజన ప్రజానీకంపై యుద్ధం చేస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపుతున్నారు. ఏపీ ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీ క్రూరత్వానికి ప్రతినిధిగా నిలుస్తోంది’ అని రాఘవులు విమర్శించారు.

Updated Date - Nov 25 , 2025 | 06:14 AM