Share News

CPM General Secretary: ఉద్యమాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిలువరించాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 06:41 AM

దేశంలో నేడు నయా ఫాసిస్ట్‌ స్వభావంతో నడుచుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్యమాలతో నిలువరించడానికి వామపక్షాలన్నీ సిద్ధమవ్వాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి పిలుపునిచ్చారు.

CPM  General Secretary: ఉద్యమాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిలువరించాలి

  • ఇందుకు వామపక్షాలు సిద్ధమవ్వాలి

  • సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి పిలుపు

మద్దిలపాలెం (విశాఖ పట్నం), సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో నేడు నయా ఫాసిస్ట్‌ స్వభావంతో నడుచుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్యమాలతో నిలువరించడానికి వామపక్షాలన్నీ సిద్ధమవ్వాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో నూతనంగా నిర్మించిన సీపీఎం జిల్లా కార్యాలయాన్ని (ఏచూరి భవన్‌) గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను అణచివేయడానికి గూండాల గుంపులను పోగేసుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ కర్కశంగా, నేరపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను నిలువరించి వామపక్ష భావజాలాన్ని నిలబెట్టడమే ఏచూరికి నిజమైన నివాళని ఉద్ఘాటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ను పొగిడారని, కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ఉనికిని చాటుకుంటున్నాయన్నారు. కేరళలోనూ ఇదే పద్ధతి పాటిస్తున్నాయన్నారు. అసోంలో విదేశీయుల పేరుతో పౌరుల హక్కులను కాలరాస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తోందన్నారు. అనంతరం ఏచూరితో తన అనుభవాలను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, కె.లోకనాథం, సీనియర్‌ నాయకులు సి.హెచ్‌.నరసింగరావు, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ, నాయకులు జగ్గునాయుడు, ఆర్కెఎస్వీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 06:42 AM