CPM: గూగుల్ డేటా సెంటర్‌పై ప్రజలకు వాస్తవాలు చెప్పండి
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:19 AM
విశాఖలో ఏర్పాటుచేయనున్న గూగుల్ డేటా సెంటర్‌కు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రాయితీలతోపాటు దానివల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఉద్యోగ అవకాశాలు గురించి వాస్తవాలను ప్రజలకు వివరించాలని...
సీఎంకు సీపీఎం బహిరంగ లేఖ
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఏర్పాటుచేయనున్న గూగుల్ డేటా సెంటర్‌కు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రాయితీలతోపాటు దానివల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఉద్యోగ అవకాశాలు గురించి వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు బహిరంగలేఖ రాశారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో లేఖను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...గూగుల్ డేటా సెంటర్ రాబోయే ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు సీఎం వెల్లడించారని, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ 1.8 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రకటించారని, అయితే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ నేతలు అన్ని ఉద్యోగాలు రావని, పర్యావరణానికి నష్టం జరుగుతుందని చెబుతుండడం గందరగోళానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. గూగుల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని, దీనివల్ల గూగుల్‌కు లాభాలు వస్తాయి తప్ప, రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమిటో చెప్పడం లేదన్నారు. గూగుల్ డేటా సెంటర్‌కు రెండు వేల మెగావాట్ల విద్యుత్, రోజుకు 80 ఎంజీడీల నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలకు నష్టం జరగని విధంగా గూగుల్‌డేటా సెంటర్‌పై తుదినిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.